తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల సందడి తుది దశకు చేరుకుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో (బుధవారం) గడువు ముగియనుంది. దీంతో, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నామినేషన్ల సంఖ్య చివరి రోజు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థితో బల ప్రదర్శనగా నామినేషన్లు వేయించడానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. నేడు నామినేషన్ల దాఖలు అనంతరం, అభ్యర్థులు తమ విజయానికి కావాల్సిన రాజకీయ సమీకరణాలపై దృష్టి పెట్టనున్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
అక్టోబర్ 13న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా.. ఇప్పటివరకు 127మంది నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు శుక్రవారంతో ముగుస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుండగా.. అదే నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఉపఎన్నిక కోసం 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా, సుమారు 3.2 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే, ఈ ఉపఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, ఈ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. చివరి నిమిషంలో ఎవరు నామినేషన్ వేస్తారు, ఎవరికి మద్దతు పెరుగుతుంది అనే చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.