బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం “మొంథా తుఫాన్”గా మారే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్ని విభాగాల సమన్వయంతో తుపాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా.. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులందరినీ అత్యవసర మోడ్లో ఉంచామని తెలిపారు. ప్రతి జిల్లాకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి, ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. విద్యుత్, తాగునీరు, రవాణా వంటి కీలక సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రజలకు తుపాన్ తీవ్రత, వర్షం అంచనాలు, తీరప్రాంత పరిస్థితులపై సమయానుకూల సమాచారం చేరేలా చర్యలు చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ ఆహారం, వైద్య సహాయం, తాగునీరు వంటి అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఇక తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 30 వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ప్రజలు ఏదైనా సమస్యల కోసం వాటిని సంప్రదించాలంటూ సూచించింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మొంథా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని విధాల సన్నద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
#CycloneMontha
మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో… గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశాం. జిల్లాలకు అవసరమైన… pic.twitter.com/vR2VKg6qOe— N Chandrababu Naidu (@ncbn) October 26, 2025







































