తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ప్రాథమిక సమాచారం ప్రకారం 24 మంది మృతి చెందారు, మరియు 15 మంది వరకు గాయపడ్డారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.
వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీ కొట్టడంతోపాటు ఏకంగా బస్సులోకి దూసుకెళ్లింది. దీంతో ఒకవైపు బస్సు మొత్తం ధ్వంసం అవడం ప్రమాదం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంకా లారీ లోని కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో బస్సులోని వారు అందులో కూరుకుపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సహా టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్ లోనే ప్రాణాలొదిలారు.
ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్సులను పిలిపించి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, సహాయక చర్యల్లో చేవెళ్ల సీఐ గాయపడ్డారు. కంకర తొలగిస్తున్న సమయంలో ఆయన కాలు దెబ్బతింది. దీంతో ఆయనను కూడా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద వివరాలు:
మొత్తం ప్రయాణికుల సంఖ్య: ప్రమాదం జరిగిన సమయంలో తాండూరు డిపోనకు చెందిన ఈ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాద తీవ్రత: ప్రమాద తీవ్రత కారణంగా ప్రయాణికులు సీట్లలోనే ఇరుక్కుపోయారు. టిప్పర్ లోడులో ఉన్న కంకర బస్సులోకి పడటంతో, ముందు వరుసలో ఉన్న 5 సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మృతులు/క్షతగాత్రులు: ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. గాయపడిన మరో 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్గం: తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సు, మీర్జాగూడ సమీపంలో ప్రమాదానికి గురైంది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీ ఘటన మరువకముందే..:
ఇటీవల జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన విషాదం మరువకముందే, చేవెళ్లలో ఈ ఘోర ప్రమాదం జరగడం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

































