30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ఇవాళ (శుక్రవారం) విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
సదస్సులో పాల్గొన్న ప్రముఖులు
-
కేంద్ర మంత్రులు: పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్.
-
రాష్ట్ర ప్రముఖులు: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్ విజయానంద్.
-
సీఐఐ నాయకత్వం: సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ.
-
పారిశ్రామిక దిగ్గజాలు: అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ, జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు, భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా కె.ఎల్లా, యూసఫ్ అలీ, బాబా కల్యాణి వంటి ప్రముఖులు, దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
పారిశ్రామిక దిగ్గజాల కీలక వ్యాఖ్యలు..
సదస్సు ప్రారంభానంతరం పలువురు పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ వృద్ధి, పారిశ్రామిక వాతావరణంపై ప్రశంసలు కురిపించారు.
- ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో ఏపీ ఆధునికంగా మారుతోంది. భారత్‌లో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఏపీ నిలిచింది. డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ రంగంలో అదానీ సంస్థ ఏపీతో కలిసి పనిచేస్తోంది. ఏపీ వృద్ధిలో భాగస్వామిగా ఉంటాం. – కరణ్ అదానీ (అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ)
- సీఎం చంద్రబాబు విజన్‌తో ఏపీకి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషం. ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకోసిస్టమ్‌ను ఏపీలో సిద్ధం చేస్తున్నాం. – గ్రంధి మల్లిఖార్జునరావు (జీఎంఆర్ సంస్థ చైర్మన్)
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా యుగం నడుస్తోంది. నౌకా నిర్మాణం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. డిఫెన్స్ ఉత్పత్తులు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్య కల్పనలో ఏపీతో భాగస్వామ్యం అవుతున్నాం. – అమిత్ కల్యాణి (భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ)
- భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కృతం అవుతుంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ప్రారంభించిన జీనోమ్ వ్యాలీ వల్లే భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయగలిగింది. – సుచిత్రా కె.ఎల్లా (భారత్ బయోటెక్ ఎండీ)










































