ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో నేడు (బుధవారం, నవంబర్ 26) ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పల్లె ప్రజల జీవన ప్రమాణాలు, గ్రామీణాభివృద్ధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగంలోని కీలకాంశాలు
జాతీయ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..
- మీ ప్రేమ నన్ను భయపెడుతుంది: జనసేన కార్యకర్తలు, అభిమానులు నాపై చూపించే ప్రేమకు నాకు ఒక్కోసారి భయం వేస్తుంది. మీ ప్రేమ, అభిమానం అలా ఉంటుంది. ఇంతటి అభిమానాన్ని చూపుతున్నందుకు కృతజ్ఞతలు.
- కాశ్మీర్లో అయినా పర్లేదు కానీ: కాశ్మీర్లో అయినా నిబ్బరంగా ఉండగలం కానీ, ఇక్కడ మీరున్న సభలో మీ అభిమానులను భరించడం చాలా కష్టం అని, ప్రధానమంత్రికి రక్షణ విధులు నిర్వహించే సెక్యూరిటీ అధికారులు కూడా నాతో చెప్పారు (నవ్వుతూ).
-
గ్రామాలే వెన్నెముక: రాష్ట్రానికి గ్రామాలే వెన్నెముక వంటివని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, మెరుగైన జీవనానికి కృషి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
-
పల్లె పండుగ ఉద్దేశం: ‘పల్లె పండుగ 2.0’ ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుందని వివరించారు.
-
ప్రజల భాగస్వామ్యం: ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే కేవలం ప్రభుత్వ ప్రయత్నమే కాకుండా, ప్రజలందరి క్రియాశీల భాగస్వామ్యం కూడా అవసరమని పవన్ కళ్యాణ్ కోరారు.
- ఓట్ల కోసం కాదు: కోనసీమ రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే తాను ఇక్కడకు వచ్చానని.. ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు.
- తేడా గమనించండి: గత ప్రభుత్వ హయాంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో గుర్తుచేసుకోండి. నాడు జరిగిన తప్పులను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుతుతోంది.
- మరో 15 సంవత్సరాలు: సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి మరో 15 సంవత్సరాలు మద్దతు ఇవ్వండి. మన రాష్ట్రం రూపురేఖలు మార్చి చూపిస్తాం.
ఇక భారీగా ప్రజలు, జనసేన కార్యకర్తలు హాజరైన ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకి చెందిన ఉన్నతాధికారులు మరియు స్థానిక కూటమి పార్టీల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.







































