ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం

Telangana Assembly Speaker Gaddam Prasad Rejects Disqualification Petitions Against Five MLAs

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి ఆయన నిరాకరించారు.

ఈ మేరకు సదరు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని, వారు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెప్పిన వాదనతో స్పీకర్ ఏకీభవించారు. ఈ క్రింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైనే శాసనసభ స్పీకర్ ఈరోజు తన నిర్ణయాన్ని తెలియజేశారు.

1. అరికెపూడి గాంధీ
2. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
3. తెల్లం వెంకట్రావు
4. టి. ప్రకాశ్ గౌడ్
5. గూడెం మహిపాల్ రెడ్డి

అయితే, ఈ వ్యవహారం వెనుక సుదీర్ఘ న్యాయపోరాటం దాగి ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు జూలై 2025లో ఆదేశించింది.

అయితే గడువు ముగిసినా ఫలితం లేకపోవడంతో, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ “గ్రాస్ కంటెంప్ట్” (న్యాయస్థాన ధిక్కరణ) కింద హెచ్చరించింది. డిసెంబర్ 18 లోపు తుది నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించడంతో స్పీకర్ విచారణలు వేగవంతం చేసి, ఈ ఐదుగురి విషయంలో తొలి దశ తీర్పును వెలువరించారు.

బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వీడియోలు, ఫోటోలు మరియు పార్టీ సమావేశాల్లో పాల్గొన్న ఆధారాలను సమర్పించినప్పటికీ, సాంకేతికంగా వారు అధికారికంగా పార్టీ మారలేదని స్పీకర్ అభిప్రాయపడ్డారు. విప్ ధిక్కరణ వంటి అంశాలు లేకపోవడం, కేవలం మర్యాదపూర్వక భేటీలుగా పరిగణించడం వల్ల వారిపై వేటు వేయలేమని స్పష్టం చేశారు.

సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. రికార్డుల ప్రకారం వారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం పార్టీ కండువాలు కప్పుకున్నంత మాత్రాన లేదా ఇతర నేతలను కలిసినంత మాత్రాన వారిని అనర్హులుగా ప్రకటించలేమని స్పీకర్ తన తీర్పులో వివరించారు.

ఇక మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్‌లపై విచారణలు ముగిశాయని, వారిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నా, ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నా ఆధారాలు లేవనడం, స్పీకర్ వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీర్పుపై తిరిగి సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. మరోవైపు, ఈ నిర్ణయంతో సదరు ఐదుగురు ఎమ్మెల్యేలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here