వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది.అంతేకాదు ఆమె అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న రజిని దూకుడుగా ఉంటూ.. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆమె సైలెంట్ అయ్యారు.
రజిని మంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారంటూ ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ. 2.02 కోట్లు వసూలు చేశారని యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు అయ్యింది. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
రజినీతో పాటు గుంటూరు ఆర్వీఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, ఆయాచిత లబ్ది కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపులు వంటి చర్యలను.. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లను చేర్చుతూ రజినీపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏ1గా విడదల రజిని ఉండగా.. ఏ2గా ఐపీఎస్ పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ 4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణపై కేసు నమోదు అయ్యింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఏసీబీ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా..దీనిపై విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆయన సిఫార్సుతోనే ఏసీబీ విచారణకు సర్కారు ఆదేశించింది. దీంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తులో ఈ ఫిర్యాదుపై రజినీకి వ్యతిరేకంగా ఆధారాలు లభించడంతో కేసులు నమోదు చేశారు.
పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌ను నిర్వహిస్తున్నారు. ఆ స్టోన్ క్రషర్ యజమానులను పిలిపించిన అప్పటి మంత్రి రజిని.. వారిపై విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండటానికి తాము అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారని..దీనికోసం ఐదు కోట్ల రూపాయలు తమ దగ్గర డిమాండ్ చేశారని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పల్లె జాషువా..తమ క్రషర్‌పై తనిఖీల పేరుతో హడావిడి చేశారని.. ఎవరు ఫిర్యాదు చేయకుండానే అక్కడకు వెళ్లారని ఆ యాజమాన్యం ఆరోపించింది. ఆ దాడుల భయంతోనే సంబంధిత యజమానులు రెండు కోట్ల రెండు లక్షలు విడుదల రజినీకి చెల్లించారని.. దానిలో ఐపీఎస్ అధికారి జాషువాకు కూడా పది లక్షల రూపాయలు ముట్టిందని ఆరోపించారు. దీనిపైన వారు ఫిర్యాదు చేయడంతో ఇప్పడు ఏసీబీ రంగంలోకి దిగింది.దీంతో విడదల రజినీ అరెస్ట్ జరిగే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.