
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రక్షాళన చేస్తూ వస్తున్న ఏపీ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావుని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ద్వారకా తిరుమల రావు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. కోఆర్డినేషన్ విభాగం డీజీపీగానూ నియమించారు. పోలీసు దళాల అధిపతిగా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. బుధవారం రాత్రి సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమల రావు.. గుంటూరువాసి. దేవాపురంలో సామాన్య కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారిగా విధులు నిర్వర్తించారు. తిరులరావుకి ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్‌లో తిరుమలరావు గోల్డ్‌మెడల్ అందుకున్నారు. 1989లో తిరుమలరావు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
తిరుమలరావు భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో తిరుమలరావు కర్నూలు ఎస్పీగా, ధర్మవరం ఎస్పీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు చెన్నై సీబీఐలో కూడా తిరుమలరావు విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2021 జూన్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావు .. ఇప్పుడు సీనియార్టీ ప్రకారం డీజీపీగా నియమితులయ్యారు.
అయితే ఏపీ ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల సంఘం తొలగించింది. ఆయన స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. హరీశ్ కుమార్ గుప్తానే ఏపీ డీజీపీగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం ముందుగా భావించినా.. ఆ తర్వాత అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతోనే ద్వారకా తిరుమలరావు డీజీపీగా ఎంపిక అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE