
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ఏపీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులను పదవీ విరమణ పొడిగించడంతో చంద్రబాబు గవర్నమెంటు వారందరినీ రాజీనామాలు చేయమని కోరింది. దీనికి తోడు జగన్ సర్కారుకు అడుగులు మడుగులు ఒత్తిన అధికారులపైనా చంద్రబాబు దృష్టి సారించారు. వారు ఉంటే ప్రస్తుత ప్రభుత్వానికి పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది అధికారులు బదిలీలు కాగా..మరి కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.
అయితే అనూహ్యంగా ఇప్పుడు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేయగా ఆయన ఆమోదించడంతో సవాంగ్ గురించి ఏపీ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు సవాంగ్ డీజీపీగా పని చేసి.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ కూడా అయ్యారు. అయితే పదవీ విరమణకు రెండేళ్ల ముందే ఇప్పుడు సవాంగ్ రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి వచ్చీరాగానే.. ఠాకూర్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించి గౌతమ్ సవాంగ్‌కు బాధ్యతలను అప్పగించారు. దాదాపు మూడేళ్ల పాటు సవాంగ్ ఆ పదవిలో ఉన్నారు. అయితే గౌతమ్ సవాంగ్ తాము ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని భావించిన జగన్ ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తప్పించింది. కానీ ఈ పరిణామాలపై సవాంగ్ మనస్తాపానికి గురయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో..అప్పటికప్పుడు ఆయనతో రాజీనామా చేయించి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.
మరోవైపు గౌతమ్ సవాంగ్ డీజీపీగా కొనసాగిన సమయంలో వైసీపీ అనుకూల ముద్రనే ఆయన వేసుకున్నారు. అంతకు ముందు కూడా బెజవాడ సీపీగా సవాంగ్ కొనసాగిన సమయంలో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సవాంగ్ వ్యవహరించారు. ఆ తర్వత వైసీపీ ప్రభుత్వంలో డీజీపీ పదవి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడి ఇంటిపై జోగి రమేష్ దాడి చేయడంతో పాుట, టీడీపీ నేతలపై దాడులు జరిగినా కూడా ఆయన ఉపేక్షించారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం మారి మళ్లీ చంద్రబాబు రావడంతో తనకు వ్యక్తిగత ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో సవాంగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY