బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమి 200కు పైగా స్థానాలతో భారీ మెజారిటీని నమోదు చేసి సునామీ లాంటి విజయం సాధించింది. ఈ అద్భుత విజయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలవగా, ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన అధినేత) హర్షం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు, బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, నితీశ్ కుమార్కు మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ, బీహార్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ అభినందనలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (జనసేన అధ్యక్షుడు), ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం దేశ భవిష్యత్తుకు మరియు అభివృద్ధికి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొంటూ.. ప్రధాని మోదీకి, నితీశ్ కుమార్కు, ఇతర ఎన్డీఏ నాయకులకు అభినందనలు తెలియజేశారు.
సీఎం పీఠంపై ఉత్కంఠ:
ఇక బీహార్ ప్రజలు ఇచ్చిన ఈ స్పష్టమైన తీర్పుతో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. అయితే సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? అనే విషయమై సందిగ్ధం నెలకొంది. ఎన్డీయే కూటమిలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని బీజేడీ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకోవడం గమనార్హం. దీంతో సీఎం పీఠంపై బీజేపీ, బీజేడీ మధ్య ఉత్కంఠ నెలకొంది. మరో ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








































