ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ‘మెగా పేరెంట్స్ మీట్’ (Mega Parents Meet) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించబడింది.
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరవగా.. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
సమావేశంలో కీలక అంశాలు
-
విద్యా సంస్కరణలు: రాష్ట్రంలో విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన సంస్కరణలు, సాంకేతికత వినియోగం మరియు మెరుగైన బోధనా పద్ధతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
- అలాగే, విద్యార్థుల్లో కేవలం అకడమిక్ నైపుణ్యాలే కాకుండా, సామాజిక స్పృహ, నైతిక విలువలు కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
-
పవన్ కళ్యాణ్ ప్రసంగం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి వారు దైవసమానులు అవుతారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు అంత గొప్ప స్థానం ఉంటుంది. అందుకు ఈ పేరెంట్ – టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.
- “మొన్న పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవని కొందరి రాజకీయ లబ్దికోసం కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకని పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరం” అని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు.
-
మంత్రి లోకేష్ పాత్ర: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర విద్యా ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. విద్యారంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను, ఇస్తున్న ప్రాధాన్యతను, భవిష్యత్తు లక్ష్యాలను గురించి వివరించారు.
-
తల్లిదండ్రుల భాగస్వామ్యం: విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వం, పాఠశాలల మధ్య వారధిగా పనిచేయాలని ఈ సమావేశం ద్వారా కోరారు.
































