ఇకపై అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు – సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Says, From Now Onwards Amaravati Can't Be Moved Even an Inch

అమరావతిని ఇకపై ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు ఆయన నెల్లూరు జిల్లా వింజమూరులో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అయితే, ఈరోజు అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో వైసీపీ వంటి పార్టీని, జగన్‌ వంటి వ్యక్తిని చూడలేదని వైసీపీ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారికి కాలం చెల్లిందని, అమరావతిని ఇక ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని, దానికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ పార్లమెంటులో కొనసాగుతోందని సీఎం తెలిపారు. రేపు (గురువారం) రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందనుందని, ఇది అమరావతికి లభించే గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు సభకు రాకపోవడం వారి వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

వింజమూరు సభ – ముఖ్యాంశాలు:
  • సామాజిక భద్రత: దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన 63 లక్షల మంది పేదలకు గౌరవప్రదంగా ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని, ఇది మొక్కుబడిగా చేస్తున్న పని కాదని సీఎం వివరించారు.

  • మహిళా సాధికారత: ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా ఆడబిడ్డల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, వారికి అదనంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని గుర్తు చేశారు.

  • నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత: ఈ ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉదయగిరి ప్రాంతానికి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

  • పోలవరంపై స్పష్టత: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

పేదల జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘P4’ విధానాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టులతో ఉదయగిరి ప్రాంతంలో నీటి ఎద్దడిని శాశ్వతంగా తొలగిస్తామని, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే కడప జిల్లా ఒంటిమిట్టకు బయలుదేరి, అక్కడ జరిగే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొననున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయని, దీనివల్ల సామాన్యుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు మరింత చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here