ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత రంగనాయకులు మండపంలో వారికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు.
దీనికి ముందు సామాన్య భక్తుల్లా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. క్యూ కాంప్లెక్స్ వద్ద సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న సీఎంకు శ్రీవారి ఆలయ అర్చకులు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభాన్ని స్పృశించి, నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. చంద్రబాబు కుటుంబం తరిగొండ వెంగమాంబ అన్నదానసత్రంలో నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, మనవడు దేవాన్ష్ , భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. నారా దేవాన్ష్ పుట్టినరోజును పురష్కరించుకుని సీఎం చంద్రబాబు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు ఒక రోజు అన్నదానం ఖర్చు 44లక్షల రూపాయలను విరాళంగా అందజేసింది. కాగా నారా దేవాన్ష్ మొదటి పుట్టిన రోజు నుంచి కూడా చంద్రబాబు కుటుంబం 44 లక్షల రూపాయలను అన్నప్రసాదం కోసం విరాళంగా అందజేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ.. విరాళాన్ని అందజేశారు.