శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ పరిస్థితేంటి?.. సీటు త్యాగం చేయడం వల్ల ఆయనకు దక్కిందేంటి?.. చివరికి ఆయనకు మిగిలింది మొండి చేయేనా?.. అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టికెట్ దక్కలేదు.. ఎమ్మెల్సీ పదవీ ఇవ్వలేదు.. దీంతో ఆయ పరిస్థితి ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయిదేళ్లుగా వర్మ ఎన్నికల కోసం ఎదురు చూశారు. పిఠాపురం నుంచి ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే అనిపించుకోవాలని తహతహలాడారు. కానీ చివరి నిమిషంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు. పవన్ గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారు. పవన్ కళ్యాణ్ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు.
టీడీపీ పార్టీతో రాజకీయాల్లోకి వర్మ ఎంట్రీ ఇచ్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగగీత చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రెండోసారి వర్మకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ నిరాకరించడంతో 2014లో ఇండిపెండెంట్‌గా వర్మ పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ వర్మకు టికెట్ ఇచ్చింది కానీ ఈసారి పెందెం దొరబాబు చేతిలో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా టికెట్ దక్కుతుందని వర్మ ఆశించారు. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. అయితే వర్మ వర్గీయులు మాత్రం సీటు త్యాగానికి ముందు అంగీకరించలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వర్మను పిలుపించుకొని మాట్లాడడంతో.. వారంతా ఆందోళనలను విరమించుకున్నారు.
అప్పట్లో టీడీపీ హైకమాండ్ వర్మకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో ఆయన వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది. టీడీపీ ప్రభుత్వం కొలవుదీరగానే తనకు ఎమ్మెల్సీ దక్కుతుందని వర్మ కూడా ఆశించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి వర్మకు కన్ఫామ్ అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఆ రెండు ఎమ్మెల్సీ పదవులను వర్మకు కాకుండా వేరే వారికి కట్టబెట్టారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సీ రామచంద్రయ్యకు.. మరోటి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్‌కు కేటాయించారు. దీంతో వర్మకు అటు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు.
అటు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురాన్ని తన కంచుకోటగా మల్చుకుంటున్నారు. ఇటీవల అక్కడ మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటున్నారు. ఇకపై అక్కడే పవన్ ఉంటారని అంటున్నారు. అలాగే 2029 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే పిఠాపురం జనసేన ఇంఛార్జిగా నాగబాబును నియమించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలో వర్మ మరో స్థానానికి షిఫ్ట్ అవ్వక తప్పదనే వాదన తెరపైకి వచ్చింది. మరి చూడాలి ముందు ముందు వర్మ ఏ నిర్ణయం తీసుకుంటారో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY