నెల్లూరు జిల్లా డి .చౌటుపాళెంలో తాజాగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. తన ప్రసంగాల్లో రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చంటూ అందరికీ పిలుపునిచ్చారు. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ కుటుంబ సభ్యుడిగా, ధర్మపరుడిగా, న్యాయవంతమైన పాలకుడిగా ఎలా జీవించాడో చూపిస్తుందని… అదే విధంగా, మహాభారతం మానవ జీవితంలోని సంక్లిష్టతలు, నీతి యుద్ధాలు, కర్తవ్యాల గురించి వివరిస్తుందని చెప్పారు. ఈ గ్రంథాలు యువతకు సరైన మార్గాన్ని చూపించడమే కాకుండా సమాజంలో వివక్ష, అవినీతి వంటి దుర్గుణాలను అరికట్టడానికి ప్రేరణనిస్తాయని వెంకయ్య నాయుడు చెప్పారు.
రామాయణం, మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలను అంతా చదవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదేపదే చెప్పారు. ఈ రెండు గ్రంథాలు కేవలం సాహిత్య రచనలు మాత్రమే కాదన్న ఆయన..రామాయణం, మహాభారతం ..జీవన విలువలు, నీతి, ధర్మం, సంస్కృతిని నేర్పే జీవన గైడ్‌లని అభిప్రాయపడ్డారు. యువతలో చదివే అలవాటును పెంపొందించడంతో పాటు.. వీటి ద్వారా నైతికతను పెంపొందించడం తన లక్ష్యమని చెప్పారు. శ్రీరాముడు అసమానతలు లేని ఆదర్శ పాలన అందించారని గుర్తు చేశారు.
రామాయణం, మహాభారత, భారత ఇతిహాస గ్రంథాలను హిందువులు అత్యంత పవిత్రమైన గ్రంథాలుగా భావిస్తారు. వీటి ఆధారంగా మనిషి జీవితం నడుస్తుందని పండితులు చెబుతారు. వీటిని చదివి ఒంట పట్టించుకోవాడం ద్వారా మంచి నడవడిక, జీవన విధానం తెలుస్తాయని చిన్నప్పటి నుంచి గురువులు కూడా చెబుతూ ఉంటారు. ఇప్పుడు మాజీ ఉప రాష్ట్రపతి కూడా అదే సూచించడంతో మరోసారి ఈ రెండు గ్రంథాలపై చర్చ సాగుతోంది.
నెల్లూరులోనే కాదు గతంలోనూ వెంకయ్య నాయుడు ఈ రెండు గ్రంథాల గురించి మాట్లాడారు. 2024 జనవరిలో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు..రామాయణం, మహాభారతం విద్యా విధానంలో భాగం కావాలని అన్నారు. ఇవి కేవలం మత గ్రంథాలు కాదన్నారు. జీవన విలువలను నేర్పే గొప్ప ఇతిహాసాలని ఆయన అన్నారు. ఇవి ఆదర్శ రాజ్యమని.., మానవత్వం గురించి గాంధీజీ చెప్పిన ’రామ రాజ్యం’ భావనకు అద్దం పడతాయని వెంకయ్య నాయుడు గొప్పగా చెప్పారు.