ఏపీకి టీసీఎస్.. గేమ్ చేంజర్ అవుతోందా?

త్వరలో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఏపీ ప్రభుత్వం కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించడం సంచలనం రేపుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో..విశాఖపట్నం ఐటీ రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందా అనే చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చంద్రబాబు చొరవ వల్లే వచ్చిందని..ఇప్పుడు అదే చొరవ విశాఖలోనూ చూపించడంతో అతి త్వరలో ఐటీ హబ్ గానే కాదు.. విశాఖ రూపు రేఖలను కూడా మారుస్తుందన్న వాదన వినిపిస్తోంది.

విశాఖపట్నంని టెక్ హబ్‌గా మార్చాలనే టార్గెట్‌తో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టీసీఎస్‌కి కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. ఏప్రిల్ 15న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదించడంతో ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. విశాఖని ప్రధాన సాంకేతిక కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోన్న ఏపీ ప్రభుత్వం ..దీనిలో భాగంగానే టీసీఎస్‌కు ఈ భూమిని కేటాయించింది. ఐటీ మంత్రి నారా లోకేష్ 2024 అక్టోబర్‌లో ముంబైలో గల టాటా మెయిన్ ఆఫీసుకు వెళ్లినప్పుడు టీసీఎస్‌కి ఈ ప్రతిపాదనను మొదటగా వినిపించారు లోకేష్. తమ తదుపరి భారీ అభివృద్ధి కేంద్రం కోసం ఏపీ పరిగణించాలని టెక్ దిగ్గజాన్ని మంత్రి కోరారు.

అప్పటి నుంచి టీసీఎస్‌తో నిరంతరం చర్చలు జరిపిన ఏపీ ప్రభుత్వం .. చివరికి తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తీసుకువచ్చింది. ఈ చర్య ద్వారా ఇండస్ట్రీలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత స్థాయి సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ సిద్ధంగా ఉండటంతో పాటు పోటీతత్వంతో ఉందని చాటి చెప్పాలని చూస్తోంది. ఈ నిర్ణయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు .. టాటా మోటార్స్‌కు సనంద్‌లో 99 పైసలకే భూమిని కేటాయించిన పారిశ్రామిక వ్యూహంతో సరిపోలుస్తున్నారు. అప్పట్లో ఈ చర్య గుజరాత్ ఆటోమోటివ్ రంగాన్ని ప్రోత్సహించిందని.. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

అప్పట్లో గుజరాత్‌లో నరేంద్ర మోదీ తీసుకున్నఆ నిర్ణయం ఆటోమొబైల్ ఇండస్ట్రీ వృద్ధికి దోహదపడగా.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తుండటంతో..ఇది ఏపీకి ముఖ్యంగా విశాఖకు ఎంతవరకు లాభం చేకూరుస్తుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్ దాదాపు 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. అలాగే 10,000 మందికి టీసీఎస్‌లో ఉద్యోగాలు కల్పించనుంది. ఇది విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుదనడంలో సందేహం లేదని అంటున్నారు.