మార్చి 14న జనసేన 12వ ప్లీనరీ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని అంతా భావించినా.. దానిని ఒక రోజుకు కుదించినట్లు తెలుస్తోంది. ఏపీలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ మేజర్ రోల్ పోషిస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో కీలకమైన శాఖలకు మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. దీంతో జనసేన పార్టీ ప్లీనరీ మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తుందని అంతా భావించారు.
మార్చి 14న జనసేన 12వ ప్లీనరీ జరగనున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్లీనరీ ఆ మూడు రోజులు కాదు.. ఒక్క రోజనన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై జనసేన పార్టీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ మంత్రుల మాటలను బట్టి ప్లీనరీ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం అవుతుందని తెలుస్తోంది. దీనిపై జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి అధికారంలోకి వచ్చిన తరువాత ఒకరోజు చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ 11ఏళ్లూ ఘనంగా నిర్వహించేవారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనసేన కార్యకర్తలతో పాటు మెగా అభిమానులు తరలి వచ్చేవారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో సరికొత్త జోష్ ను నింపేవారు. ఈ ఏడాది ఏపీలో జనసేన అఖండ విజయం సాధించిన తర్వాత ఆవిర్భావ దినోత్సవాన్ని కాస్తా ప్లీనరీగా మార్చారు. తొలుత మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పినా.. ఒక్కరోజు అన్న సంకేతాలే ఎక్కువగా వస్తున్నాయి.
మంత్రి నాదెండ్ల మనోహర్ ప్లీనరీపై తరచూ రివ్యూ నిర్వహిస్తుండగా..మరో మంత్రి దుర్గేశ్ కూడా సమీక్షిస్తున్నారు. వీరిద్దరూ కూడా మార్చి 14న జరిగే ప్లీనరీ అంటూ సంబోధిస్తుండటంతో కార్యక్రమం ఒక్క రోజుకే పరిమితం అవుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఈనెల 19 వరకు కొనసాగనున్నాయి. మధ్యలో మూడు రోజులపాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే..అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ప్లీనరీని ఒక రోజుకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ప్లీనరీ మూడు రోజులపాటు నిర్వహిస్తే వేదికపై నిరంతరాయంగా కూర్చోడానికి ఇబ్బందులు పడొచ్చనే కారణం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.