జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పవన్ కల్యాణ్ అభిమానులు వేలాదిగా హాజరై సభా ప్రాంగణాన్ని జనసేన జెండాలతో కిక్కిరిసేలా మార్చారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ సనతానం, హిందూ ధర్మం, భాష సహా పలు అంశాలపై అనర్గలంగా మాట్లాడారు. మరోవైపు, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
ఆయన మాట్లాడుతూ, “పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంలో రెండు ముఖ్యమైన ఫ్యాక్టర్లు పనిచేశాయి – ఒకటి పవన్, రెండోది పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ నేత వర్మను ఉద్దేశించి చేసినవని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేశాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్‌కు వర్మ సహాయపడగా, ఇప్పుడు ఆయన్నే విస్మరించారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తీరు ‘తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు’ ఉందని వైసీపీ విమర్శిస్తోంది.
జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు చేస్తూ, నాగబాబు మాట్లాడుతూ, “అధికారంలో ఉన్నాం కదా అని అహంకారంతో మాట్లాడకూడదు. అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. నోటికొచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో చూశాం” అని హెచ్చరించారు. జనసేన ప్రతిపక్షంలో లేదని, అందువల్ల కార్యకర్తలు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. అయితే, జనసేన మద్దతుదారులు మాత్రం తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు.
నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ, “మీరు ఏది చెప్తే అది నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కారు” అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే జనసేన వర్గాలు మాత్రం తమ నాయకత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ సభలో నాగబాబు నాయకుల మాటతీరు ఎంత ప్రాధాన్యమైనదో వివరిస్తూ, “నాయకులు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో గతంలో చూశాం. నోటిదురుసుతో వ్యవహరించిన ఒక నేతకు చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అందుకే పవన్ కల్యాణ్ ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజలకు సమాధానాలివ్వగలిగే విధంగా మాట్లాడాలని చెబుతారు” అని పేర్కొన్నారు.
మొత్తంగా, జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఒక ప్రణాళికను అందించినట్లుగా అనిపిస్తోంది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినా, జనసేన సిద్ధాంతాలను స్పష్టంగా తెలియజేస్తూ, భవిష్యత్‌లో పార్టీ తీసుకునే విధానాలను ప్రజలకు తెలియజేసేలా నిలిచాయి.