చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ – ఏపీలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నం

Maoists Face Setback In Chhattisgarh Seeking Refuge In Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతపై స్పీడ్ పెంచింది. ‘ఆపరేషన్ కతార్’ పేరుతో మావోయిస్టులపై భద్రతా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులపై భారీగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, గత మూడు నెలలుగా చత్తీస్‌ఘడ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన వరుస ఎన్‌కౌంటర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

చత్తీస్‌ఘడ్‌లో తాజాగా జరిగిన ఓ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించారు. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చత్తీస్‌ఘడ్‌లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మావోయిస్టులు, పొరుగున ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి పారిపోతున్నట్లు సమాచారం.

మావోయిస్టులకు ఏపీ మరోసారి ఆశ్రయం?
గతంలో మావోయిస్టులకు ఏపీలోని నల్లమల అటవీ ప్రాంతం, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (AOB) ప్రధాన ఆశ్రయ ప్రాంతంగా ఉండేది. ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లో పెరిగిన ఎన్‌కౌంటర్ల దాడులతో మావోయిస్టులు మళ్లీ ఏపీకి వలస వస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ, “ఇటీవల మూడేళ్ల తర్వాత మొదటిసారిగా 30 మంది మావోయిస్టులు ఏపీ వైపు ప్రవేశించారు. వీరిలో 13 మంది పార్టీని వదిలి వెళ్లిపోయారు. మిగతా వారిని గుర్తించి, పట్టుకునేందుకు స్పెషల్ టీములు గాలింపు చర్యలు చేపట్టాయి” అని తెలిపారు. అలాగే, “పక్క రాష్ట్రాల్లో మావోయిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఏపీని ఆశ్రయంగా వాడుకునేంత అసమర్థులు మన పోలీసులు కాదు” అంటూ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.

మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారికి నజరానా!
మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ బృందాలు గ్రామాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, మావోయిస్టుల వివరాలు పోలీసులకు తెలియజేస్తే భారీ మొత్తంలో నజరానా ఇస్తామని గోడపత్రికలు వెలిశాయి. శ్రీకాకుళం జిల్లాలోని కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ గోడపత్రికలు ప్రత్యక్షమయ్యాయి.

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు యాక్షన్ బృందాల సభ్యులు గ్రామాల్లో సంచరిస్తున్నారు. వీరి సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నజరానా అందిస్తామని పోలీసులు వెల్లడించారు. మంప ఎస్సై శంకరరావు మాట్లాడుతూ, “అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోడపత్రికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.

మావోయిస్టులకు చత్తీస్‌ఘడ్‌లో ఎదురవుతున్న దెబ్బలతో వారు ఏపీ, ఒడిశా వైపు మరలుతుండటం భద్రతా పరంగా కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో, భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, వారిని ఏపీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.