ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో కొత్త ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు వెలువడుతున్నాయి.
శాసనమండలిలో ఈ అంశంపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలో జిల్లా విభజన నిర్ణయం మంత్రివర్గంలో చర్చించకుండానే తీసుకున్నారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండానే తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పలు జిల్లాల్లో మౌలిక వసతుల కొరత నెలకొన్నదని పేర్కొన్నారు. అయితే, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సహా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా మార్పులు చేయాలని నిర్ణయించారు.
అదేవిధంగా, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన 372 సివిల్ సర్జన్ పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.