వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నా కొందరి నేతల తీరు మాత్రం మారడం లేదు. దీంతోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై తాజాగా వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసి.. రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వంతు రావడంతో..ఇక అతని వంతే ఉందని ప్రచారం నడుస్తోంది.
అసెంబ్లీకి వచ్చే ముందు దువ్వాడ శ్రీనివాస్.. సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండటానికి.. పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే శాసనసభలో అసలు పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. దీంతో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు అందడంతో.. దువ్వాడపై కేసులు నమోదవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముందుగా గుంటూరులోని పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. జనసేన నాయకుడు కడప మాణిక్యాలరావు గుంటూరులో ఫిర్యాదు చేయగా ఇది అంశంపై విజయనగరంలో .. కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పై దువ్వాడ కాస్త లిమిట్ దాటే మాట్లాడారు. చంద్రబాబుతో పాటు నాటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడుపై చాలా రకాలుగా మాట్లాడారు.
అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అది కూడా డిప్యూటీ సీఎం అయిన పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. ఏపీ వ్యాప్తంగా ఒకేసారి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నేడో, రేపో దువ్వాడ అరెస్ట్ తప్పకుండా ఉంటుందని ప్రచారం నడుస్తోంది.