ఏపీలో మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు ఎంతో ప్రీతిపాత్రమైనవని, నిబద్ధతతో మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తన వెన్నునొప్పి కారణంగా కొన్ని రాష్ట్ర సమావేశాలకు హాజరుకాలేకపోయానని, ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తున్నట్లు పవన్ తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో, పవన్ కళ్యాణ్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. అనంతరం ఎన్డీఏ నేతలందరికీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సమయంలో జాతీయ మీడియా పవన్ తో చిట్ చాట్ నిర్వహించగా, ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు.
మోదీ – పవన్ కళ్యాణ్ ఆసక్తికర సంభాషణ
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. స్టేజీ వద్దకు వచ్చినప్పుడు, పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఉండటంతో, ప్రధాని మోదీ సరదాగా స్పందించారు. “హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా?” అని ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ “హిమాలయాలకు వెళ్లేందుకు ఇంకా సమయం ఉంది” అని బదులిచ్చారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రశ్నించగా, మోదీతో తన సంభాషణను పవన్ కళ్యాణ్ వివరించారు.
పవన్ కళ్యాణ్ కు ఎన్డీయేలో ప్రాధాన్యత
ఎన్డీయేలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో కీలకమని అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీయే నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపైకి వచ్చిన ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పలకరించి, ఆప్యాయంగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కు మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జనసేన కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది.
అనంతరం మీడియా పవన్ కళ్యాణ్ ను మోదీ ఏమన్నారు అని ప్రశ్నించగా, “ప్రధాని మోదీ నాపై చాలాసార్లు సరదాగా జోకులు వేస్తుంటారు. నేడు నా వస్త్రధారణ చూసి ‘అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళుతున్నావా?’ అని అడిగారు. దానికి నేను ‘చేయాల్సింది చాలా ఉంది’ అని సమాధానమిచ్చాను” అని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ దీక్షల్లో ఉంటే ప్రత్యేక దుస్తులు ధరించడం సాధారణం. ఢిల్లీలోనూ అదే దుస్తులతో హాజరుకావడంతో మోదీ ఇలా సరదాగా వ్యాఖ్యానించారు.