ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు నామ్ కే వాస్తే ఒకసారి మాత్రమే సభకు వచ్చిన మాజీ సీఎం జగన్..ఆ తర్వాత రకరకాల కారణాలతో సభకు దూరంగా ఉంటూ వచ్చారు. దీనికి అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాకముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు .. వైఎస్ జగన్ ను ఎక్కడో తాకడమేనన్న వార్తలు వినిపించాయి.
దీంతోనే అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఎన్నిక అయినపుడు కూడా జగన్ అసెంబ్లీకి హాజరవలేదు. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావించారో ఏమో తెలియదు కానీ సభకు దూరంగా ఉండటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుపట్టుకుని కూర్చున్నారు. చివరకు ఇదే విషయాన్ని కోర్టు ముందు ఉంచారు. అయితే ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాలి. కానీ జగన్ వర్గానికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా ఇలా పట్టుపట్టడం ఏంటని తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే జగన్ ను అసెంబ్లీకి రావాలంటూ, ప్రజా సమస్యలపై చర్చించాలంటూ శాసనసభా వ్యవహారాలమంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం, స్పీకర్ నిరాకరిస్తున్నారన్న వంకతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని అయన్నపాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు.
వైఎస్ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని, ఓ ఎమ్మెల్యే మాత్రమేనని స్పీకర్ అయన్నపాత్రుడు తెలిపారు. అంతేకాదు అసెంబ్లీకి వచ్చి జగన్‌ను గెలిపించిన..తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని అసెంబ్లీకి రాననడం సరికాదని చెప్పారు. జగన్‌కు తను ఇచ్చే సలహా ఒక్కటేనని, పదవులు వస్తుంటాయి, పోతుంటాయని..కానీ ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని స్పీకర్ సూచించారు. దానికి తాను జగన్ మోహన్ రెడ్డికి అవకాశం కల్పిస్తానని తెలిపారు. తాను అవకాశం ఇవ్వనని ఆయన ఎందుకు అనుకుంటున్నారని జగన్‌ను ప్రశ్నించిన స్పీకర్.. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్‌కు కూడా మాట్లాడటానికి అవకాశం ఇస్తానన్నారు.