ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. చాలాకాలంగా పార్టీలో కొనసాగుతున్నవారికి.. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టారని తెలిసి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలతో నాయకులు పదవులకు సంబంధించి మంతనాలు జరుపుతున్నారట.
ఇదెలా ఉండగా అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా చర్చనడుస్తోంది. తెలుగు దేశం పార్టీ నుంచి కూడా పలువురు సీనియర్ నేతలు టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మరి ఎవరిని ఆ పదవి వరిస్తుందనే చర్చనీయాంశమయింది. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు నాయుడు ఓ సీనియర్ నేతను ఎంపిక చేసినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రారంభం నుంచి ఉన్న అశోక్ గజపతిరాజును టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.
అశోక్ గజపతిరాజు.. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని ప్రారంభంచినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా పని చేశారు. 2014-19 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయంగా, పాలనాపరంగా ఆయనకు అపార అనుభవం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండి.. తన కూతురిని బరిలోకి దింపారు. ఆయన కుమార్తె అదితివిజయలక్ష్మి 60 వేలకు పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈక్రమంలో అశోక్ గజపతిరాజును టీటీడీ ఛైర్మన్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారట. త్వరలనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ