
ఆంధ్రప్రదేశ్ లో సిట్ దర్యాప్తు ఉత్కంఠను రేపుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించి, సంబంధిత వీడియోలను సేకరించి, కేసుల తీవ్రతను కూలంకశంగా శోధించి సుమారు 150 పేజీలతో సిట్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. అంతకు ముందే ఎన్నికల కమిషన్ కొందరు పోలీసులను సస్పెండ్ చేసింది. ప్రజాప్రతినిధుల్లో ఎవరెవరి పాత్ర ఉందనేది నివేదిక పరిశీలన అనంతరం వెల్లడి కానుంది. ఈక్రమంలో అల్లర్లకు గల కారణాలపై చర్చ జరుగుతోంది. కొందరు పోలీసులు అల్లర్లకు పాల్పడేవారికి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అల్లర్లకు ఆద్యం పోసిన ప్రజాప్రతినిధుల కంటే.. అరికట్టడంలో విఫలమైన పోలీసు అధికారులపై ఇప్పటికే ఈసీ చర్యలు చేపట్టింది. అలాగే పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి 30 మందిని కూడా జైలుకు పంపారు.
హింసాత్మక ఘటనలకు ఈసీ సీరియస్ గా తీసుకోవడం, సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాపై కేసులు ఎత్తేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని చెప్పుకొచ్చారు.
దాడి ఘటనను మీడియా ద్వారా రిపోర్ట్ చేయడమే నేరమన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పేలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విశాఖలో ఎన్నికల అనంతరం హింసను అదుపుచేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమ కేసులతో మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి కూడా పంపినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
అలాగే.. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనాను వైసీపీ నేతలు కూడా కలిశారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతోందని అన్నారు. అల్లర్లు జరగకుండా చూడాలని ఈసీని కోరామని తెలిపారు. జోగి రమేశ్ మాట్లాడుతూ.. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా రాజకీయపార్టీలన్నీ పోలీసుల వైపే తప్పు చూపుతున్నాయి. సిట్ నివేదిక సమర్పించడంతో ఇప్పుడు ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడం ఉత్కంఠగా మారింది. అల్లర్లను ప్రోత్సహించిందెవరు, సహకరించిందెవరు.. అనేది నివేదిక పరిశీలన అనంతరం ప్రాథమికంగా ఈసీ తేల్చనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY