సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఇంటికి చేరుకున్న బన్నీ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత రేవతి కుటుంబానికి హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. “ఆ కుటుంబానికి జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. కానీ నా వంతు బాధ్యతగా, అన్ని విధాలా వారికి అండగా ఉంటాను” అని బన్నీ చెప్పారు.
బాధిత కుటుంబానికి ఏం కావాలన్నా నేను అండగా ఉంటా. అలాంటి ఘటన మళ్లీ ఎవరితోను జరగకూడదు. బాధిత కుటుంబం బాధను తీరుస్తామని హామీ ఇస్తున్నా” అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువగా స్పందించడానికి ఇష్టపడలేదని ఆయన స్పష్టం చేశారు.
20 ఏళ్ల అనుబంధం
సంధ్య థియేటర్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, దాదాపు 30 సార్లు అక్కడ సినిమాలు చూశానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. “గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇది చాలా దురదృష్టకరం. బాధితురాలి కుమారుడు శ్రీతేజను త్వరలోనే పరామర్శిస్తాను” అని అన్నారు.
జైలు నుంచి ఇంటికి
శుక్రవారం అరెస్టైన అల్లు అర్జున్, శనివారం హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆత్మీయంగా కలిశారు. భార్య స్నేహరెడ్డి భావోద్వేగానికి గురవ్వగా, దర్శకుడు సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి పలువురు అతన్ని పరామర్శించారు.
మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు
మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్, “దేశవ్యాప్తంగా నాపై ప్రేమాభిమానాలు చూపిన వారికి ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో నా కుటుంబానికి, నన్ను సపోర్ట్ చేసిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు. “ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదు. అనుకోకుండా జరిగిన ఘటన. ఆ సమయంలో నేను నా కుటుంబంతో పాటు థియేటర్‌లో సినిమా చూస్తున్నా. దీనికి నా ఏ విధమైన ప్రత్యక్ష సంబంధం లేదు,” అని వివరించారు.
‘పుష్ప 2’ విడుదలలో దురదృష్టకర ఘటన
‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ కుటుంబంతో హాజరయ్యారు. ఆయన్ని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడ్డారు. ఈ ఘటనలో సంబంధిత థియేటర్ నిర్వాహకులు అరెస్ట్ కాగా, అల్లు అర్జున్‌ను కూడా కేసులో ఏ11గా చేర్చారు.
“ఈ ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా, అల్లు అర్జున్ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. “మీడియా, అభిమానుల మద్దతు నాకు ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఇచ్చింది” అని చెప్పారు.