సినిమా చేయడం అనేది చాలా మందికి కల. అలాంటి కల ఏ కొందరికో సాధ్యం అవుతుంది. తెరమీద వారిని చూసుకోవడానికి ఎన్నో వ్యయ, ప్రయాసలు, కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఫేస్ చేయాలి. చిత్రపరిశ్రమలో గాడ్ ఫాదర్ ఉన్నవాళ్లకు ఎంట్రీ ఈజీనే కానీ.. ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం అంటే అంత ఈజీ కాదు. సైడ్ పాత్రల నుంచి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఆగస్ట్ 22న పుట్టిన రోజును జరుపుకొంటున్న చిరంజీవి..ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచారు.
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే ఒక నినాదమే చిరంజీవిని సామాన్యుడ నుంచి సెలబ్రెటీని చేసింది. ముళ్ల దారిలో నడుచుకుంటూ చిరు చేసిన పోరాటం ఇప్పుడు అతనికి, అతనితో పాటు ఎంతోమంది పూలబాటను పరిచింది. ఎప్పుడైనా మనకు కావలసింది ఈజీగా వస్తే దాని విలువ తెలీదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన ఎంటైర్ కెరియర్లో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన అపజయాలను కూడా ఫేస్ చేసినా అభిమానుల్లో మాత్రం అనువంత ప్రేమ కూడా తగ్గలేదు..
అప్పటి వరకూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు టాలీవుడ్‌ను దున్నేసారు. కానీ చిరంజీవి వచ్చా సినిమా చూసే అభిమానులకు హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కేరక్టర్ ను పరిచయం చేసింది మాత్రం మెగాస్టార్ అంటే ఒప్పుకోకతప్పదు. మూసదోరణిలో కొట్టుకుపోతున్న ప్రేక్షకుడికి కొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఇక హీరో అంటే ఎలా ఉండాలో అర్ధాన్ని చెప్పిన నటుడు మెగాస్టార్ అయ్యారు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన, మరుపురాని పాత్రలను పోషించారు. పునాది రాళ్లు, పున్నమినాగు, ప్రాణం ఖరీదు, ఖైదీ, స్వయంకృషి, రుద్రవీణ ఎంటి ఎన్నో ఉత్తమమైన పాత్రలను పోషించి చిరంజీవిని మించిన నటుడు మరొకరు లేరనే గుర్తింపును సంపాదించుకున్నారు.
ఖైదీ, గ్యాంగ్ లీడర్ , జగదేకవీరుడు అతిలోకసుందరి, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ఎన్నో కమర్షియల్ హిట్లను సొంతం చేసుకొని 40ఏళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి… ఆయన వేసిన బాట ఆ తరువాత జనరేషన్ కి పూలబాటలా మారింది.అమితాబ్ బాలీవుడ్ ను ఏలుతున్న ఆ రోజుల్లోనే కోటి పారితోషికం తీసుకున్న ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు.