బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు బెదిరింపు కాల్ వచ్చింది. షారుఖ్ ఖాన్ నవంబర్ 2న తన 59వ పుట్టినరోజు జరుపుకున్నాడు సరిగ్గా 5 రోజుల తర్వాత ఆయనను చంపేస్తానని బెదిరింపు కేసు వెలుగులోకి రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే దీని వెనుక ఉన్న కారణాలేమిటనేది ఆయన్ను ఎందుకు టార్గెట్ చేశారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. షారుక్‌కు హాని తలపెడతానంటూ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి బెదిరించాడని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు.
దాదాపు రూ.2 కోట్ల ముడుపులను తనకు ఇవ్వకుంటే షారుక్ ప్రాణాలతో బతకలేడని సదరు కాలర్ బెదిరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. కాల్ వచ్చిన నంబరును పోలీసులు ట్రాక్ చేయగా.. అది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఉన్న లొకేషన్‌ను చూపించింది. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఫోను నుంచి షారుక్‌ను బెెదిరిస్తూ మెసేజ్ వచ్చిందని వెల్లడైంది.
ముంబయి పోలీసులు కూడా నిందితుడిని కనుగొనడానికి రాయ్‌పూర్‌కు బయలుదేరారు. ఈ ప్రమాదకరమైన కుట్రను ఎవరు పన్నుతున్నారో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు షారుక్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు వార్తల ఆధారంగా చెబుతున్నారు. అంతే కాదు ప్రాణాల కావాలంటే కోట్లాది రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ విషయంపై షారుక్ గానీ.. ఆయన సిబ్బంది గానీ ఇంకా అధికారిక ధృవీకరణ చేయలేదు.
షారుక్ ఖాన్‌కు గత సంవత్సరం అక్టోబరులోనూ హత్య బెదిరింపు వచ్చింది. దీంతో ఆయన సెక్యూరిటీ లెవల్‌ను ‘వై ప్లస్’ కేటగిరీకి పెంచారు. ఇందులో భాగంగా షారుక్ సెక్యూరిటీ కోసం ఆరుగురు సాయుధ భద్రతా సిబ్బంది నిత్యం వెంట ఉంటారు. అంతకుముందు షారుక్ వెంటనే ఇద్దరు మాత్రమే సాయుధ భద్రతా సిబ్బంది ఉండేవారు. మొన్నటికి మొన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు కూడా బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సినీ ప్రియులు షాక్ కు గురవుతున్నారు.