భారత క్రీడా ప్రపంచాన్ని తన ప్రతిభతో కట్టిపడేసిన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం ఆయనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించి, సైన్యంలో ఆయన చేస్తున్న సేవలకు గౌరవం తెలిపింది. ఈ మేరకు నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నీరజ్ చోప్రాకు దీనిని ప్రదానం చేశారు.
Delighted to confer the insignia of Honorary rank of Lieutenant Colonel in the Territorial Army upon Neeraj Chopra, India’s outstanding sportsperson and two-time Olympic medalist.
Neeraj Chopra is an epitome of perseverance, patriotism and the Indian spirit of striving for… pic.twitter.com/PASbKS2fpM
— Rajnath Singh (@rajnathsingh) October 22, 2025
2021లో టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత క్రీడా చరిత్రలో నీరజ్ చోప్రా చిరస్థాయిగా నిలిచారు. సైన్యంలో చేరిన తరువాత కూడా ఆయన తన క్రీడా సాధనను కొనసాగిస్తూ దేశానికి గౌరవం తీసుకువస్తున్నారు. భారత సైన్యంలో క్రీడాకారుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2016లో ‘సుబేదార్’గా సైన్యంలో చేరిన ఆయన అనంతరం 2021లో ‘మేజర్’గా ప్రమోషన్ పొందారు. అలాగే 2021లో భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డును అందించిన కేంద్రం, 2022లో ‘పరమ విశిష్ట సేవా పతాకం’తో నీరజ్ చోప్రాను సత్కరించింది. కాగా, నీరజ్ ప్రస్తుతం ‘రాజ్‌పుతానా రైఫిల్స్’ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ పదోన్నతితో క్రీడల ద్వారా దేశ సేవ చేయాలనుకునే యువతకు నీరజ్ చోప్రా ప్రేరణగా నిలుస్తారని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO)గా సేవలందిస్తున్న నీరజ్‌కు ఈ పదోన్నతి లభించడం దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే భవిష్యత్‌లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.