ట్రైన్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ను 60 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఇది 120 రోజులుగా ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. సవరించిన ఈ కొత్త రూల్స్ నవంబర్ 1, 2024 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పును ప్రకటించింది.
ప్రస్తుతం రైలు ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. దానిని 60 రోజులకు తగ్గించింది రైల్వే శాఖ. అయితే, ఇప్పటికే 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు సైతం సమాధానం ఇచ్చింది రైల్వే శాఖ. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. వారి రిజర్వేషన్ ప్రకారం బెర్తులు కేటాయింపు ఉంటుందని సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా ఓ ప్రకటన జారీ చేసింది. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్న నేపథ్యంలో అక్టోబర్ 31వ తేదీ వరకు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది.
ఇక విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నిబంధనల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో రైల్వే ముందస్తు బుకింగ్ ప్రయాణానికి 60 రోజుల ముందు వరకు ఉండేది. దాన్ని 120 రోజులకు పెంచారు. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోకే వెల్లడం గమనార్హం. కాగా దీని ప్రభావం నేడు ఐఆర్ సిటిసి షేర్ ట్రేడింగ్ మీద పడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు 2.2 శాతం పడిపోయి రూ. 867.60 వద్ద ఒక్కో షేరు ట్రేడయింది. కాగా తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఇప్పటికే తక్కువగా ఉంది.