దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ప్రభుత్వ విధానాలు కీలకంగా మారుతున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షల రూపాయల వరకు పెంచడం ఉద్యోగ వర్గానికి, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారింది. పది సంవత్సరాల క్రితం కేవలం 2.50 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండగా, ఇప్పుడు అది దాదాపు ఐదు రెట్లు పెరిగి 12 లక్షల వరకు చేరుకుంది.
ఇది మధ్య తరగితికి ఆర్థికంగా ఊరట కలిగించే చర్యగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు, వేతన జీవులు పన్నుల భారం తగ్గడంతో తమ ఆదాయాన్ని మరింత పొదుపు చేయగలరు. దీని వలన వారు వివిధ పెట్టుబడుల వైపు మళ్లగలరు లేదా వినియోగాన్ని పెంచగలరు. దీని ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్ పెరిగి, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది.
గత మూడేళ్లుగా కోవిడ్ కారణంగా పెరిగిన అప్పుల భారాన్ని ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. ఈ బడ్జెట్ కూడా అదే దిశలో కొనసాగింది. పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరగడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు నెలకొన్నా, ముఖ్యంగా యూరప్‌లో (ప్రధానంగా జర్మనీలో), భారత ప్రభుత్వం పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తూ, మధ్య తరగతి ప్రజల చేతిలో డబ్బును ఉంచేలా నిర్ణయాలు తీసుకోవడం ఆర్థికంగా ఎంతో సమర్థమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు.
ఇక అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులను పరిశీలించినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల అనంతరం అమెరికా లోపల పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దిగుమతులపై అధిక సుంకాలు విధించడం, విదేశీ పెట్టుబడులను అడ్డుకోవడం వంటి చర్యలు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఈ పరిస్థితుల్లో మన దేశంలో పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. అంతేగాక, ఎగుమతులు కూడా తగ్గితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రాముఖ్యమైనది. ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ ద్వారా అద్భుతాలు సృష్టించలేను. కానీ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించి ఆర్థిక ప్రగతిని పెంచేందుకు ప్రయత్నించారా లేదా అనేదే అసలు ప్రశ్న. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ దిశగా ముందుకు సాగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఒకే సమయంలో ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, పెట్టుబడులకు ఊతమిచ్చి, ప్రజల ఆదాయాన్ని మెరుగుపరిచేలా రూపొందించబడింది. దీని ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేసే ప్రయత్నం జరిగింది.
ఈ బడ్జెట్ మధ్య తరగతికి ఊరట కలిగించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీకి తగిన విధంగా మార్పులు చేయడం వంటి కీలక అంశాలను సుసంపన్నంగా కలుపుకుంది. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.