మూడేళ్ల రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి ట్రంప్ ఫుల్‌స్టాప్

తాను అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో యుద్ధాలు ఆపేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో..డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి..అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టారు. కాగా తాను ఇచ్చిన మాట ప్రకారం యుద్ధాలు ఆపడానికి ఇటు రష్యా, ఉక్రెయిన్, అటు ఇజ్రాయెల్‌తోనూ చర్చలు జరిపారు.

ఇజ్రాయెల్, హమాస్‌ దేశాల మధ్య 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం చేయించిన ట్రంప్.. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పూర్తిగా ఆపే ప్రయత్నం కూడా సక్సెస్‌ అయింది.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించినట్లు వాషింగ్టన్‌ నుంచి వెలువడిన వార్తల ప్రకారం తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పుతిన్ సుమారు రెండు గంటల ఫోన్‌ సంభాషణ తర్వాత రష్యా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌ హౌస్‌ తెలిపింది. ఈ సందర్భంగా రెండు దేశాల నేతలు శాశ్వత శాంతి స్థాపనతో..ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి సంకల్పించారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడాలని, ద్వైపాక్షిక సహకారం అవసరమని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.

కాగా..మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం రెండు దేశాలకు తీవ్ర నష్టాలనే మిగిల్చింది. అనేక ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీగా నిధులు కూడా ఖర్చయ్యాయి.ఈ విషయాన్ని ట్రంప్ హైలెట్ చేశారు. ఈ నిధులను ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వివాదాలు మరోసారి తలెత్తకుండా సామరస్యపూర్వక పరిష్కారాలతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇప్పుడే ముగించాలని సూచించారు.

యుద్ధ విరమణకు తీసుకోవాల్సిన చర్యలపై డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌ చర్చించారు. ముఖ్యంగా ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలపై దాడులను ఆపడంతో పాటు..నల్ల సముద్రంలో కాల్పులను నియంత్రించడం వంటి అంశాలపై తక్షణ చర్యలుగా చేపట్టడానికి ఇద్దరు నేతలు నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను.. చర్చల ద్వారా పరిష్కరించాలని ట్రంప్‌ పుతిన్‌కు సూచించారు.

ట్రంప్ తీసుకువచ్చిన ఈ శాంతి ప్రక్రియకు పుతిన్‌ ఒక షరతు విధించారు. ఉక్రెయిన్‌కు విదేశీ సైనిక సాయంతో పాటు నిఘా సమాచారం అందించడాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు. ట్రంప్‌ దీనిని స్వాగతించినట్లు తెలుస్తోంది.మొత్తంగా ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు.. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముగింపు పలికే ఒక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.