ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రపంచంలోనే మొట్టమొదటి విక్రమాదిత్య వేద గడియారం ప్రారంభించారు. సంప్రదాయ భారతీయ కాలమానం ఆధారంగా రూపొందించిన ఈ గడియారం, సాంకేతికతతో మిళితమై వినూత్న ఆవిష్కరణగా నిలిచింది. ఇప్పుడు, ఒక సంవత్సరం తర్వాత, 2025 మార్చి 30న విక్రమాదిత్య వేద గడియారం మొబైల్ యాప్ ను విడుదల చేయనున్నారు. అంతేకాదు, 100 కంటే ఎక్కువ చిన్న వేద గడియారాలను రూపొందించి, దేశ విదేశాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
వేద గడియారం ప్రత్యేకతలు
ఈ గడియారం 189 భాషలలో పనిచేస్తుంది. అత్యాధునిక ఆటోమేటిక్ చిప్ ఉపయోగించడం వల్ల కరెంట్ లేకున్నా నిరంతరం పనిచేయగలదు. ఇది సూర్యోదయ సమయాన్ని ప్రామాణిక సమయంగా తీసుకొని, దాని ప్రకారం సమయాన్ని లెక్కించగలదు. భారత ప్రామాణిక సమయం (IST) తో పాటు, గ్రీన్విచ్ సగటు సమయం (GMT) ను కూడా అనుసంధానం చేస్తుంది.
విక్రమాదిత్య వేద గడియారం యాప్
GPS ఆధారంగా పనిచేసే ఈ యాప్ సూర్యోదయ సమయాన్ని ఖచ్చితంగా గుర్తించి, వేద కాలమానం ప్రకారం సమయాన్ని చూపిస్తుంది. ఈ యాప్ ద్వారా గ్రహ స్థితి, నక్షత్రాల సమాచారం, ఉష్ణోగ్రత, గాలి వేగం, చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం, భారతీయ క్యాలెండర్ వివరాలు వంటి అనేక అంశాలు తెలుసుకోవచ్చు.
భవిష్యత్తు ప్రణాళికలు
ప్రస్తుతం 100 కంటే ఎక్కువ వేద గడియారాలను రూపొందించి ప్రధానమంత్రి కార్యాలయం, కొత్త పార్లమెంటు భవనం వంటి ప్రదేశాల్లో అమర్చనున్నారు. ఇది భారతీయ కాలమానం ఆధారంగా ప్రపంచానికి మన సాంస్కృతిక, శాస్త్రీయ గొప్పతనాన్ని తెలియజేయడంలో కీలకంగా మారనుంది.