తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన మహారాష్ట్రకు చెందిన గోల్డ్ బాయ్స్ సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్త త్రయ గుజర్ , ప్రీతి సోనిలు అక్కడ అట్రక్షన్ గా మారారు. ఇవాళ ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో వారు పాల్గొన్నారు. వీళ్ల ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి భక్తులు నోరెళ్లబెట్టారు. దర్శనం తర్వాత ఆలయం బయటకు వస్తుండగా వారిని చూడటానికి, ఫోటోలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు. వీరు ధరించిన ఆభరణాలు దాదాపు 10 కేజీలు ఉంటుందని చెబుతున్నారు.. ఈ బంగారం ధర రూ.కోట్లలో ఉంటుందట. కేజీల కొద్దీ బంగారాన్ని ఒంటిపై దిగేసుకుని రావడంతో ఈ ముగ్గుర్ని మిగతా భక్తులు కళ్లు పెద్దవి చేసి మరీ చూశారు. మెడలో తాళ్ల సైజులో గొలుసులు, చేతికి కడియాలు, ఉంగరాలు ఉన్నాయి.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన వీళ్లను గోల్డెన్ బాయ్స్ గా పిలుస్తారు. వాళ్ల ఒంటినిండా బంగారు నగలే. మెడలో తాడు లాంటి బంగారు చైన్లు ఎప్పుడు ధరిస్తారు. మోచేతుల వరకు బంగారు పట్టీలు వేసుకుంటారు. వాళ్లతో పాటు వచ్చిన మహిళ బంగారుతో చేసిన చీరెను ధరించి కనిపించారు. ఇదివరకు హిందీ బిగ్ బాస్ హౌస్‌లోనూ వీరు మెరుపులు మెరిపించారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చాలాకాలంగా శ్రీవేంకటేశ్వరస్వామి ని దర్శించుకోవాలని అనుకుంటున్నారట. ఆ కోరిక నేటితో తీరిందని అన్నారు. కాగా గతేడాది కూడా మహారాష్ట్ర నుంచి ఓ కుటుంబం కూడా ఇలాగే బంగారంతో సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన సుభాష్ చంద్ర, సోనీ కుటుంబం స్వామివారి దర్శనానికి వచ్చారు. వేంకటేశ్వర స్వామి ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాలతో కనిపించారు.
తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్, అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి, తెలంగాణ స్టేట్ మాజీ ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ పార్థసారథి, తెలంగాణ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాలు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం తో సత్కరించారు.