మన దేశంలో బంగారం కొనాలనుకునేవారు చాలామంది బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా భారత ప్రభుత్వం గోల్డ్ బులియన్‌కి సంబంధించి ఓ కొత్త రూల్ తీసుకువస్తోంది.దీని ప్రకారం, వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి గోల్డ్ బార్, బిస్కెట్ లేదా కాయిన్ మీద హాల్‌మార్క్ ముద్రించడం తప్పనిసరి.ఇండియాలోకి వచ్చే అన్ని గోల్డ్ బార్స్, కాయిన్స్‌కు కూడా వర్తిస్తుంది.
దీనికి ముందు బంగారు ఆభరణాలపై మాత్రమే హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. 2022 నుంచి అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు ఈ ప్యూరిటీ మార్క్‌ని తప్పనిసరిగా చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ గోల్డ్ పై కూడా ఈ ప్యూరిటీ మార్కును తప్పనిసరి చేయబోతున్నారు. ఈ ముద్ర వల్ల బంగారం నిజమైనదని తెలియడంతో పాటు దాని స్వచ్ఛతను కూడా తెలియజేస్తుంది.
బిఐఎస్ హాల్‌మార్కింగ్ నియమాలను అమలు చేస్తుంది. జనవరి నుంచి అమల్లోకి వచ్చే నియమం ప్రకారం, నగల వ్యాపారులు తమ సొంత నగలు, వస్తువులను తయారీ చేయడానికి ఉపయోగించే బంగారు కడ్డీలకు మాత్రం హాల్‌మార్క్ వేయించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఉన్న పరీక్షా, హాల్‌మార్కింగ్ కేంద్రాల వద్ద ఆ పసిడి కడ్డీలను టెస్ట్ చేయవచ్చు.
బంగారు నగల నాణ్యతను కాపాడాలంటే, బంగారం బిస్కెట్ల మీద కూడా హాల్‌మార్క్ ముద్ర ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారని.. అందుకే దాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించిందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెబుతోంది. బంగారం నగలు తయారు చేయడానికి చాలామంది బంగారం కడ్డీలు, బిస్కెట్లనే వాడతారు. దీనికి తోడు భారత దేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశమన్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే బంగారం స్వచ్ఛత విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయింది.