మానవతా విలువలు పతనమవుతున్న నేటి ఆధునిక కాలంలో రక్షాబంధన్ వేడుకకు ప్రత్యేకత ఉంది. సోదరీ సోదర అనురాగ బంధాన్ని మరింత పటిష్టం చేసే వేడుక రక్షాబంధన్. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ ప్రతీ ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటారు. వేడుక రోజున సోదరి తన సోదరుడి కుడిచేతికి రాఖీ కట్టి, నుదుట తిలకం దిద్ది మిఠాయిలు తినిపిస్తారు. ఆ తర్వాత సోదరుల నుంచి కానుకలు స్వీకరిస్తారు. రక్తం పంచుకుపుట్టిన సోదరుల మధ్యే కాదు, ఏ బంధుత్వం లేకున్నా సోదరుడు అన్న భావనతో రాఖీ కట్టడం ఒక సంప్రదాయం. సోదరీ సోదరుల అనుబంధానికి గుర్తుగానే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగ. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు జరుపుకుంటున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రాఖీ పండగను మన పురాణాల్లో కూడా జరుపుకున్నారట. రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపధ్యం ఉంది. దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది ఇంద్రాణి. దేవేంద్రుడికి రాఖీ కట్టటంతో మొదలైన సాంప్రదాయం అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. అలా రక్షాబంధన్ మొదలయింది.
శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడువేలుకు గాయం అయ్యిందట. అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతికి హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ప్రచారంలో ఉంది.
ఈ సమయంలో రాఖీ కట్టండి
భద్ర కాలంలో రాఖీ కట్టడం నిషిద్ధం. పంచాంగం ప్రకారం భద్రకాళం ఆగస్టు 19న మధ్యాహ్నం 1.32 గంటల వరకు ఉంటుంది. అందువల్ల సోమవారం మధ్యాహ్నం 1.32 గంటల తర్వాతే సోదరీమణులు తమ సోదరులకి రాఖీ కట్టడం ఉత్తమం. మధ్యాహ్నం 2:07 నుంచి రాత్రి 08:20 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ప్రదోష కాలంలో సాయంత్రం 06:57 నుంచి రాత్రి 09:10 వరకు రాఖీ కట్టడం శుభప్రదం సోదరీమణులు తమ సోదరుడికి రక్షణ కల్పిస్తూ వినాయకుడిని ధ్యానించి, సోదరుడు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ రాఖీ కట్టాలి. రాఖీ కట్టే ముందు సోదరి తన సోదరుడికి ఎలాంటి ఆపద రాకూడదని శ్లోకం చదివి రాఖీ కడితే మంచిది. పురాతన కాలంలో శ్రీకృష్ణుడిని ద్రౌపది ఈ శ్లోకంతోనే రక్షించింది.