BSNL ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు శరవేగంగా పని చేస్తోంది. లక్ష 4G టవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన BSNL, ఈ సంవత్సరం చివరికల్లా 75 వేల టవర్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 జూన్ నాటికి 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. BSNL తాజాగా వినియోగదారుల కోసం VoLTE (వాయిస్ ఓవర్ LTE) ఫీచర్‌ను తీసుకొచ్చింది, ఇది మెరుగైన వాయిస్ క్లారిటీతో కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. VoLTE సేవలను యాక్టివేట్ చేసుకోవడానికి 4G/5G సిమ్ కార్డులు కలిగిన వినియోగదారులు “ACT VOLTE” అని టైప్ చేసి 53733కి SMS చేయవచ్చు. ప్రస్తుతం 2G/3G సిమ్ ఉపయోగిస్తున్నవారు, BSNL సెంటర్ల ద్వారా ఉచితంగా 4G సిమ్ కార్డులను పొందవచ్చు.
తక్కువ ధరలు, మెరుగైన సేవలతో వినియోగదారుల ఆకర్షణ…
ప్రైవేట్ టెలికాం సంస్థలు ధరలను పెంచడంతో BSNL వైపు వినియోగదారుల రద్దీ పెరిగింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో BSNL 62 లక్షల మందికి పైగా కొత్త యూజర్లను పొందింది. తక్కువ ఛార్జీలతో కూడిన ప్లాన్‌లు, త్వరలో 4G సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం యూజర్ల ఆకర్షణకు కారణమని ట్రాయ్ డేటా తెలియజేస్తోంది. BSNL FTTH యూజర్లకు నేషనల్ వైఫై రోమింగ్, లైవ్ టీవీ యాప్‌లు, D2D సేవలను ప్రవేశపెట్టింది. ఇంకా ఈ సేవలు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రావాల్సి ఉంది. 2024 నాటికి BSNL 4G విస్తరణ, కొత్త ఫీచర్లతో భారత టెలికాం రంగంలో కొత్త అధ్యాయాన్ని రాయాలని లక్ష్యంగా పెట్టుకుంది.