రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. వేసవి కాలంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవడమే కాకుండా..వింటర్లోనూ ఉష్టోగ్రతల ప్రభావం చూపించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమికి రక్షణ కల్పించడానికి..తాజగా డైమండ్ డస్ట్‌ను ఉపయోగించవచ్చంటూ శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారు.
సైంటిస్టుల కొత్త అధ్యయనానికి సంబంధించిన వివరాలన్నీ జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి. దీనికోసం ప్రతి ఏడాది 50 లక్షల టన్నుల డైమండ్ డస్ట్‌ను భూమి ఎగువ వాతావరణంలో తీసుకువెళ్లి అక్కడ వెదజల్లాలని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. దీనివల్ల భూమిపై 1.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. డైమండ్ డస్ట్‌ను భూమి ఎగువ వాతావరణంలో కనుక వెదజల్లితే ఆ డస్ట్ అద్దంలా పని చేస్తుందని, ఫలితంగా భూమిపై పడాల్సిన సూర్యకిరణాలను డస్ట్ అడ్డుకొని, తిరిగి అంతరిక్షంలోకే ఆ వేడిని ప్రతిబింబించేలా చేస్తుందని శాస్తవేత్తలు వివరించారు.
ఇలా అంతరిక్షంలో ఏవైనా పదార్థాలను వెదజల్లి వాటితో సూర్యకిరణాలను అడ్డుకొనేలా చేసి..ఈ ప్రభావంతో భూమిపై వాతావరణాన్ని తగ్గించే ప్రక్రియను ఎస్‌ఆర్‌ఎం అంటే.. సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్ అంటారు. గతంలో ఎస్‌ఆర్‌ఎం కోసం సల్ఫర్,అల్యూమినియం, కాల్షియం, సిలికాన్ వంటి వాటిని వినియోగించవచ్చని ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, దీని కోసం డైమండ్ డస్ట్ మెరుగ్గా పని చేయగలదని తాజాగా శాస్త్రవేత్తలు వివరించారు.