హిందూ సంప్రదాయంలో ప్రతీ పండుగ చాలా ప్రత్యేకమైనది. ప్రతీ ఏడాది వచ్చే హిందువుల తొలి పండుగ అయిన వినాయక చవితి మొదలు వచ్చిన ప్రతీ పండుగను భక్తి శ్రద్ధలతో కుటుంబమంతా కలిపి సంతోషంగా జరుపుకొంటారు. ఎన్ని పండుగలు ఉన్నా చిన్న పిల్లలకు ఇష్టమైన పండుగ ఏది అంటే మాత్రం వారంతా టక్కున దీపావళి పేరే చెబుతారు. మతాబులు కాలుస్తూ ఎంజాయ్ చేయొచ్చన్న కారణంతో దీపావళి పండుగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తూ ఉంటారు.
నిజానికి దీపావళిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తాయి. దీపావళి పండుగ రోజు అంటే లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానించడమే అనుకుంటూ భక్తితో పూజిస్తారు. కొత్త బట్టలు ధరించి, ఘనంగా జరుపుకొంటారు. అయితే ప్రతీ ఏడాది దీపావళి పండుగ కరెక్ట్‌గా దసరాకి 21 రోజల తర్వాత వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ప్రతీ ఏడాది ఇలా దసరా తర్వాత 21 రోజులకే దీపావళి రావడానికి కారణం ఏంటనే విషయం చాలా మందికి తెలియదు.
పురాణాలు ఏం చెబుతున్నాయంటే..రాముడు రావణ సంహారం తర్వాత సరిగ్గా దసరా రోజు తన సైన్యంతో కలిసి శ్రీలంక నుంచి అయోధ్యకు కాలినడకన వెళతాడు. అయోధ్యకు చేరుకోవడానికి రామునికి సరిగ్గా 504 గంటలు పట్టిందని రామాయణంలో ఉంది. అలా ఆ 504 గంటలను 24 గంటలుగా విభజిస్తే 21 రోజులు వస్తుంది. దీని ప్రకారమే దసరా వెళ్లిన 21 రోజులకు దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి అప్పట్లో పండితులు నిర్ణయించారు. నిజానికి శ్రీలంక నుంచి అయోధ్యకు కాలినడకన వెళ్లాల్సిన దూరం 3వేల145 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని నడవానికి 504 గంటలు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
రావణుడిని ఓడించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజునే ప్రజలంతా సంతోషంగా దీపావళి పండుగగా జరుపుకొన్నారుని పురాణాలు చెబుతున్నాయి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలంతా ఘనంగా దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారినట్లు పెద్దలు చెబుతారు. ముఖ్యంగా దీపావళి రోజు చాలా ప్రాంతాల్లో రావణుడి దిష్టి బొమ్మను అందుకే దహనం చేస్తారని చెబుతుంటారు. అయితే త్రేతాయుగం నుంచి కూడా దేశప్రజలంతా దీపావళి పండుగను జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. రామాయణంలో కూడా దీని గురించి వాల్మీకి మహర్షి రాశాడని చెబుతున్నాయి.