హైదరాబాద్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు చెక్ పెట్టడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ రకు పెనాల్టీతో పాటు కేసులు నమోదు చేస్తూ వస్తున్న పోలీసులు.. ఇప్పుడు కేసులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తున్నారు.
మద్యాన్న సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ అధికారులు.. వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 48 వేల లైసెన్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. వీటిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులతో పాటు, ప్రమాదాలలో మరణాలకు కారణమైన వారి లైసెన్సులనే ఎక్కువగా రద్దు చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారి విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నాలుగున్నరేళ్లలో 48 వేలకు పైగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సు లను రద్దు చేయగా… వీరిలో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేసినవారే ఎక్కువగా ఉన్నారు. నాలుగు సంవత్సరాల్లో నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
2022-2023లో ఎక్కువగా 18 వేలకు పైగా, 2023-2024లో 12 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెన్షన్‌లో పెట్టినట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నవంబరు 30 వరకు 5 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసినట్లు తేలింది. గతంలో ప్రమాదాలకు కారణమైన డీఎన్డీ కేసులలో మాత్రమే లైసెన్స్ రద్దు చేసామని..ఇకపై నిబంధనలు పదే పదే దాటితే వారికి కూడా లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ ల సస్పెన్షన్ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. తరువాతి స్థానం మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కాగా.. మూడో స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ లో రద్దు అవుతున్న లైసెన్సుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనివే ఉంటున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.