భారత్‌లోని ప్రైవేట్ పని చేసే ఉద్యోగస్తులకు రిటైర్‌మెంట్ తర్వాత… ఆర్థిక భరోసా కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ ఈపీఎఫ్ఓ స్కీములో ఉద్యోగుల కోసం అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈపీఎఫ్ఓ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందని చాలా మంది ఉద్యోగులకు తెలియదు.
ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈపీఎఫ్ స్కీములో జమ చేసే ఖాతాదారులకు 7 లక్షల రూపాయల వరకు బీమా అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమును ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే ఈడీఎల్ఐ స్కీమ్ అంటారు. 15,000 రూపాయల లోపు బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులందరికీ ఈ స్కీము వర్తిస్తుంది. అయితే సభ్యుని బేసిక్ శాలరీ 15,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే బీమా గరిష్ట ప్రయోజనం 6 లక్షల రూపాయలుగా ఉంటుంది.
ఈపీఎఫ్ఓ మెంబర్ స్కీము కోసం ఎలాంటి ప్రీమియాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈడీఎల్ఐ స్కీమ్ కింద క్లెయిమ్ మొత్తం గత 12 నెలల సగటు నెలవారీ చెల్లింపు కంటే 35 రెట్లు గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఈ బీమా స్కీము కింద 1,50,000 రూపాయల బోనస్ ఇస్తారు. ఏప్రిల్ 28, 2021 నుంచి బోనస్ మొత్తాన్ని 1.75 లక్షల రూపాయలకు పెంచారు. అన్ని ఈడీఎల్ఐసీ లెక్కింపునకు బేసిక్ పేకి డియర్‌నెస్ అలవెన్స్ తప్పనిసరిగా వర్తింప జేస్తారు. అయితే ఉద్యోగులందరికీ 7 లక్షల రూపాయల క్లెయిమ్ మొత్తం లభించదు.దీనిని కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు.
ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ మొత్తం గత 12 నెలల బేసిక్ శాలరీ, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజ్ కోసం క్లెయిమ్ చివరి బేసిక్ శాలరీ ప్లస్ డీఏ కంటే 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా 1,75,000 రూపాయల వరకు బోనస్ మొత్తం కూడా క్లెయిమ్‌దారుకు చెల్లిస్తారు. ఉదాహరణకు గత 12 నెలలలో ఉద్యోగి బేసిక్ శాలరీ + డీఏ 15,000 రూపాయలు అయితే, బీమా క్లెయిమ్ మొత్తం ..35 x 15,000 + 1,75,000 అంటే మొత్తం 7,00,000 రూపాయలు అవుతుంది.
ఈపీఎఫ్ ఖాతాదారుడ చనిపోతే అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు ఈ బీమా కవరేజీని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని కోసం నామినీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు అయినా ఉండాలి. దీని కంటే తక్కువగా ఉంటే మాత్రం అతని భార్య లేదా, అతని తల్లిదండ్రులు క్లెయిమ్ చేయవచ్చు. క్లెయిమ్ చేస్తున్నప్పుడు డెత్ సర్టిఫికెట్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి సర్టిఫికెట్స్ సమర్పించాలి. మైనర్ గార్డియన్ తరపున క్లెయిమ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా గార్డియన్ సర్టిఫికెట్,బ్యాంక్ వివరాలను ఈపీఎఫ్ ఆఫీసులో అందించాల్సి ఉంటుంది.