ఇంట్లో ఎక్కడైనా స్వీట్స్ పెడితే చాలు.. వాటిని ఏ మూల ఉంచినా… ఎక్కడి నుంచి వస్తాయో కానీ చీమలే మనకంటే ముందు వచ్చి స్వీట్స్ ను టేస్ట్ చేసేస్తాయి. ఏ స్వీటు ముక్కో కొంచెం కింద పడింది తుడుద్దాం అనుకునే లోపు అక్కడ చీమల గుంపు వచ్చేస్తుంది. స్వీట్ అనే కాదు.. కొన్ని రకాల పండ్ల వాసనకు కూడా చీమలు వచ్చేస్తాయి. కిచెన్ లో ఎప్పుడూ చీమలు చికాకు పెడుతున్నాయని చెప్పేవాళ్లు కూడా ఎక్కువ మంది ఉంటారు.
మామూలుగా స్వీట్ డబ్బా కింద, చక్కెర డబ్బా కింద చీమలు రాకుండా చీమల మందు చల్లుతాము. అయితే పొరపాటున ఆ మందు చిన్నపిల్లలు తింటే లేనిపోని తలనొప్పి. అంతేకాదు ఒక్కోసారి చీమల మందు కాస్త ఎగిరి స్వీట్స్ లో పడితే స్వీటంతా అదే వాసన. ఇటు తినలేము.. అటు పారేయలేము అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అందుకే సహజ పద్ధతులతో చీమలను వెళ్లగొడితే బెటర్.
పసుపు, కుంకుమ పువ్వుతో చీమలను దూరం చేసుకోవచ్చు. చీమలు ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా పసుపు కానీ.. కుంకుమ పువ్వు కానీ చల్లితే చీమలు అక్కడ నుండి పారిపోతాయి.
కర్పూరం నుంచి వచ్చే వాసనకు కూడా చీమలు అక్కడ నుంచి వెళ్లిపోతాయి. చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెప్పర్మింట్ ఆయిల్ పది చుక్కలు వేస్తే, మళ్లీ ఆ దరిదాపుల్లో చీమ అనేది కనిపించదు.
ఒక కప్పు వెనిగర్ లో,ఒక కప్పు నీటిని తీసుకొని రెండింటిని కలపాలి. ఆ తర్వాత దానిని స్ప్రే చేయడం వల్ల కూడా చీమలు అక్కడ నుంచి వెళ్లిపోతాయి. చీమలు ఎక్కువగా ఉన్న చోట నారింజ తొక్కలను ఉంచినా అవి కనిపించకుండా వెళ్లిపోతాయి.
నల్ల చీమలను వెళ్లగొట్టడానికి క్రిస్టల్ షుగర్ వేసినా బాగా పనిచేస్తుంది.పంచదారకు చీమలు వస్తాయి కదా మళ్లీ పంచదార వేయడం ఏంటని అనుకోవచ్చు. కానీ ముల్లును ముల్లుతోనే తీయొచ్చనే సూత్రం ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుంది. నల్ల చీమలు పంచదార చల్లితే అక్కడి నుంచి వెళ్లిపోతాయి.