తెలుగువారికే కాదు దేశవ్యాప్తంగా ఆదిపరాశక్తికి భక్తులు ఉంటారు. విభిన్న నామాలతో , వివిధ రూపాలతో కొలువైన అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలు అందుకుంటోంది. అయితే అలాంటి అమ్మవారి పేరుమీద ఆలయాలే కాదు మహా నగరాలే వెలిశాయన్న విషయం చాలామందికి తెలియదు. అయితే అమ్మవారి నామంతో వెలసిన నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయోనని చాలామంది అనుకుంటారు.
ముంబా దేవి పేరుతో ముంబై.. దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ముంబా దేవి ఆలయంలోని అమ్మవారు.. వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. అలాగే ముంబై.. వాణిజ్యపరంగా దేశంలో కెల్లా ఫేమస్ అయిన నగరం. ముంబై. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తినపుడు ఓ మత్స్యకారుల ఇంట పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరికతో ‘మహా అంబ’గా వెలిసిందట. తర్వాత ఆమె పేరు’ముంబాదేవి’గా మారినట్లు పురాణాలు చెబుతాయి. అలా అమ్మవారి పేరుతోనే ఆ మహానగరం పేరు ముంబైగా మారిందని అంటారు.
కాళీమాత పేరుతో కోల్ కతా.. కోల్‌కతా పేరు చెప్పగానే అక్కడ వెలసిన కాళికాదేవి రూపం కళ్ల ముందు కదలాడుతుంది. నల్లని రూపం, రక్త నేత్రాలు, పొడవాటి నాలుక బయటపెట్టి రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు.. తనను పూజించే భక్తుల పాలిట మాత్రం కరుణామయిగా భక్తులు చెప్పుకుంటారు. అయితే ‘కాళీఘాట్’ అనే పదం నుంచే.. కోల్‌కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. బెంగాలీ భాషలో కాళికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. మెల్లగా ఈ పేరే కలకత్తాగా.. తర్వాత కోల్‌కతాగా మారింది.
శ్యామలాదేవి పేరుతో సిమ్లా..కాళీమాత శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలం.. సిమ్లా అని పురాణాలు చెబుతాయి. ఈ గుడిని బ్రిటిష్ పరిపాలనా కాలంలో 1845లో బెంగాలీ భక్తులు నిర్మించారట. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. శ్యామలాదేవి నగరమే తర్వాత సిమ్లాగా మారిందని స్థానికులు చెబుతుంటారు.
మంగళాదేవి పేరుతో మంగళూరు..కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే.. మంగళూరు అనే పేరొచ్చింది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు మంగళాదేవి ఆలయాన్ని స్థాపించినట్లు పురాణాలు చెబుతాయి. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించి.. ఆ తర్వాత ఎంతో కన్నుల పండువగా రథయాత్రను కొనసాగించడం అక్కడ ఆనవాయితీ.
ఛండీ మాత పేరుతో ఛండీగఢ్..ఛండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణమట. ఛండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన ఛండీమాత అని, గఢ్ అంటే అమ్మవారు కొలువుండే కోట అని అర్థం. ఇలా అమ్మవారి పేరుతో ఉన్న ఈ నగరం కాలక్రమేణా ఛండీగఢ్‌గా మారిందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఛండీగఢ్‌కు 15 కి.మీటర్ల దూరంలో గల పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో అమ్మవారి కొలువు అవడంతో.. ఆ కొండపైనే దేవాలయాన్ని నిర్మించారట.
పాటన్‌దేవి పేరుతో పాట్నా..శక్తి స్వరూపిణి ‘పాటన్‌దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం..పాట్నాలో ఉంది. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటోంది. అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరిగా..తర్వాత ‘పాటనేశ్వరి’గా కొలిచేవారు. అలా ఇప్పుడు ‘పాటన్‌దేవి’గా భక్తులు కొలుచుకుంటున్నారు. అలా పాటన్ దేవి కొలువుండే నగరం పాట్నాగా గుర్తింపు పొందింది.
నైనాదేవి పేరుతో నైనిటాల్..మహిషుడిని సంహరించినపుడు దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించారట. అప్పటి నుంచి ఈ అమ్మవారు ‘నైనాదేవి’గా నైనిటాల్‌లో పూజలందుకుంటోందట. అమ్మవారి పేరు మీదనే నైనిటాల్‌గా పిలుచుకుంటారట.శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.
అమ్మవారి పేరుతో ప్రసిద్దమైన మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవి..హరియాణాలో అంబాలా – భవానీ అంబాదేవి , మహారాష్ట్రలో అంబ జోగే – అంబ జోగేశ్వరి , మహారాష్ట్రలోని తుల్జాపుర్ – తుల్జా భవాని కర్ణాటకలో హసన్ – హసనాంబ, కర్ణాటకలో మైసూరు – మహిషాసురమర్దిని, త్రిపురలో త్రిపుర – త్రిపురసుందరి,తమిళనాడులో కన్యాకుమారి – కన్యాకుమారి దేవి,ఒడిశాలోని సంబల్‌పూర్ – సమలాదేవి లేదా సమలేశ్వరి