కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జైసల్మేర్‌లో డిసెంబర్ 21న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పాత కార్లపై ఇప్పటివరకు 12%గా ఉన్న జీఎస్టీని 18%కి పెంచాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు పాప్‌కార్న్ నుంచి సెకండ్ హ్యాండ్ కార్ల వరకు పలు వస్తువులకు వర్తిస్తాయి. ముఖ్యంగా, 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల పెట్రోల్ కార్లు, 1500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల డీజీల్ కార్లు, 4 మీటర్లకు మించి పొడవున్న వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైనా ఈ పెంపు ప్రభావం చూపనుంది.
ఎవరి పై వర్తిస్తుందంటే?
జీఎస్టీ పెంపు గురించి తప్పుడు అర్థాలు రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది. పాత కార్లపై 18% పన్ను నిజమే కానీ, ఇది వ్యక్తిగతంగా కార్లను విక్రయించిన వారికి వర్తించదు. కేవలం సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్లకే ఈ నిబంధన అమలవుతుంది. అంటే, ఒక వ్యక్తి మరో వ్యక్తికి తన కారును అమ్మితే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
లాభంపై మాత్రమే జీఎస్టీ
సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్లు అమ్మినప్పుడు లాభం వచ్చినప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది, అమ్మిన మొత్తం మొత్తానికి కాదు. ఉదాహరణకు, డీలర్ ఒక కారును రూ.8 లక్షలకు కొనుగోలు చేసి, రూ.9 లక్షలకు విక్రయిస్తే, లాభమైన రూ.1 లక్షపై మాత్రమే 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, నష్టం వచ్చినప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
మార్కెట్ పై ప్రభావం
ఈ నిర్ణయం సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త పన్ను శ్లాబుతో వ్యాపారంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉండడంతో డీలర్లు మరియు కొనుగోలుదారులపై అదనపు భారం పడవచ్చు.