ఈ ఏడాది సమ్మర్..దడదడలాడిస్తుంది. రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, 45 డిగ్రీలు అంటూ రన్నింగ్ రేసు పెట్టుకుంటున్నాయి. దీంతో IMD వేడి గాలుల కోసం ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసి.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాబోయే కొద్ది రోజుల్లో వేడిగాలులు నిర్జలీకరణం, వడదెబ్బ, అలసట, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రతీ మనిషి తన శరీర బరువును బట్టి కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపం రాకుండా చూసుకోవడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, ఓఆర్ఎస్ మొదలైనవి తాగాలి. టీ, కాఫీ, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి నిర్జలీకరణాన్ని పెంచుతాయి. తేలికైన, కాటన్ దుస్తులు ధరించడం అందులోనూ ముదురు రంగు దుస్తులకు బదులుగా లేత రంగు వదులుగా ఉండే దుస్తులను ధరిస్తే మంచిది. మీ తలను కప్పుకోవడానికి టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగు ఉపయోగించండి.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకిరణాలు తీవ్రంగా ఉంటాయి.ముఖ్యంగా వృద్ధులు ,చిన్నారులు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి.
డీప్ ఫ్రై ఐటెమ్స్‌కు, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. తినడం మానుకోండి. సీజనల్ పండ్లను, ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, నారింజ, మామిడి పన్నాను చేర్చుకోవాలి. అలాగే ఆహారంలో పెరుగు, మజ్జిగ, సలాడ్ చేర్చుకోవాలి. సమ్మర్లో తీవ్రమైన వ్యాయామాలు లేదా కఠినమైన పని చేయకూడదు. పని చేయాల్సి వస్తే, మధ్యలో విశ్రాంతి తీసుకుని, నీళ్లు తాగుతూ చేయాలి.