ఇకపై పాత వెహికల్స్ హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు

తెలంగాణలో 2019కు ముందు రిజిస్టర్‌ అయిన వెహికల్స్‌కు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేట్‌‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, వెహికల్ సేప్టీని పెంచడం, దొంగతనాలను నిరోధించడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఇది అమలు చేయబడుతోంది. 2019, ఏప్రిల్‌ 1కి ముందు రిజిస్టర్‌ అయిన అన్ని వెహికల్స్‌కు.. సెప్టెంబర్‌ 30, 2025 నాటికి HSRP ప్లేట్లను ఇన్‌స్టాల్‌ చేయించుకోవాలని ..దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.సెప్టెంబర్‌ 30, 2025 తర్వాత HSRP లేని వాహనాలకు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

తెలంగాణలో HSRP ధర వాహన రకం మీద ఆధారపడి ఉంటుంది టూ వీలర్స్ అయితే రూ.320-రూ.380, త్రీ వీలర్స్ అయితే రూ.350-రూ.450, ఫోర్ వీలర్స్ లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలు: రూ.490-రూ.700గా ధర ఉంటుంది. కలర్-కోడెడ్ స్టిక్కర్: రూ.600-రూ.800గా ఉంటుంది. ఈ ధరలలో ప్లేట్ ధర, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, మరియు ట్యాక్స్‌లు ఉంటాయి.

HSRP కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలంటే.. అధికారిక వెబ్‌సైట్‌ www.hsrpts.com లేదా bookmyhsrp.com లేదా తెలంగాణ రవాణా శాఖ పోర్టల్‌ను సందర్శించాలి. తర్వాత వాహన వివరాలను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజన్ నంబర్, ఇంధన రకం, కాప్చా వంటి వివరాలను నమోదు చేయాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేయించుకుని.. ఇన్‌స్టాలేషన్ కోసం తగిన తేదీ మరియు స్థానాన్ని ఎంచుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లించి, రసీదును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ కేంద్రాన్ని సందర్శించాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, గుర్తింపు పత్రం, చిరునామా రుజువుతో నియమిత కేంద్రంలో HSRP ఇన్‌స్టాల్ చేయించుకోవాలి.లేదంటే సమీప RTO లేదా అధీకృత ఆటోమొబైల్ డీలర్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకున్నా పర్వాలేదు.