వెయ్యి, 5వందల నోట్లను కేంద్రం రద్దు చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత గతేడాది మే 19న ఆర్బీఐ 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న 2 వేల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం వంటివి చేశారు.
అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 2023, అక్టోబర్ 7 వరకు అవకాశాన్ని కల్పించింది. క్రమంగా 2 వేల నోట్లను తిరిగి వెనక్కి రప్పించిన ఆర్బీఐ.. నాటి నుంచి ఇప్పటి వరకూ 98.04 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని సోమవారం వెల్లడించింది. అంటే అక్టోబర్ 31 నాటికి దేశంలో ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.6,970 కోట్లు ఉన్నట్లు చెబుతోంది. 2023 అక్టోబర్ ఏడో తేదీ వరకూ అన్ని బ్యాంకుల శాఖల వద్ద రూ.2000 నోట్ల డిపాజిట్లకు అనుమతిని ఇచ్చారు. 2023 అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి దేశంలో ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద మాత్రమే రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతినిచ్చారు.
2016 నవంబరు నెలలో అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత 2 వేల విలువైన పెద్ద నోటును ప్రవేశపెట్టింది. గతేడాది ఆ రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే 2 వేల రూపాయల నోటును ఉపసంహరించుకున్నప్పటికీ దానికి రద్దు మాత్రం చేయలేదు. అయితే వాటిని బయటి మార్కెట్లలో, బ్యాంక్‌ల్లో ఎక్కడా తీసుకోవడం లేదు. అయితే మిగిలిన నోట్లను ఆర్బీఐ ఆఫీసులలో మార్చుకోవచ్చన్న విషయంపై అవగాహన లేనివారంతా ఇంకా తమ దగ్గరే పెద్ద నోట్లను ఉంచుకున్నట్లు ఆర్బీఐ భావిస్తోంది.