ఇటీవల పట్టణం నుంచి పల్లె వరకూ ఎక్కడ చూసినా కాలుష్యం పెరుగుతుందనే వార్తలే వినిపిస్తున్నాయి. అయితే అధ్యయనం ఇలాంటి వార్తలకు ఊరట నిచ్చింది. దేశంలో చాలాచోట్ల ఇటీవల కాలుష్య తీవ్రత తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2022లో కాలుష్య రేణువుల స్థాయి 19.3 శాతం తగ్గినట్టు తాజా రిపోర్ట్ వెల్లడించింది. దీని ద్వారా దేశ పౌరుల సగటు ఆయుర్దాయం ఏడాది పెరిగినట్లు అంచనా వేసింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం తగ్గినా కూడా..చాలా ప్రాంతాల్లో వీటి కాలుష్య ముప్పు ఎక్కువగానే ఉందని తెలిపింది.
కాలుష్య తీవ్రతకు సంబంధించి ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్-2024ను యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లోని కొన్ని జిల్లాల్లో కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. కాలుష్యం తగ్గినా.. భారత్‌లోని 42శాతం మంది పౌరులు గాలి నాణ్యతా ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజా రిపోర్ట్ వెల్లడించింది.
భారత్‌తోపాటు దక్షిణాసియా ప్రాంతాల్లో పొల్యూషన్ స్థాయిలు తగ్గడానికి అక్కడ అనుకూల వాతావరణంతో పాటు ఉష్ణ విలోమాల సంఖ్య తగ్గడమే కారణమని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పొల్యూషన్ సూక్ష్మరేణువుల స్థాయి క్యుబిక్ మీటరుకు 5మైక్రోగ్రాముల వరకు మాత్రమే ఉండాలి.
ఒకవేళ దీన్ని చేరుకోవడంలో భారత్ విఫలమైతే మాత్రం 3.6ఏళ్ల ఆయుష్షును కోల్పోయే ప్రమాదం ఉందని తాజా రిపోర్ట్ హెచ్చరించింది.డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను చేరుకుంటే మాత్రం దేశ రాజధాని ఢిల్లీ వాసుల సగటు ఆయుర్దాయం7.8ఏళ్లు పెరుగుతుందని రిపోర్ట్ తెలిపింది.
దేశంలో చాలాచోట్ల కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పటికీ.. వాటిని తగ్గించడానికి భారత్ వినూత్న విధానాలను అనుసరిస్తోందని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు. 2019లో గుజరాత్‌లో చేపట్టిన చర్యలతో సూరత్‌లో 20 నుంచి 30శాతం పొల్యూషన్ ను తగ్గించినట్లు చెప్పారు.
ఇదే విధానాలను ఇతర రాష్ట్రాలు, సిటీల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిద్వారా గాలి నాణ్యతను పెంచడం సాధ్యమేనని నివేదికలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నివాసప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తాజా రిపోర్ట్ ప్రశంసించింది.