చెడుపై మంచి చేసే యుద్ధంలో వచ్చే విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగగా విజయదశమిని లేదా దసరా పండుగను జరుపుకొంటారు. హిందూ మతంలో దసరా పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను ఎంత ఘనంగా చుట్టాలందరినీ పిలుచుకుని జరుపుకొంటారో.. తెలంగాణలో దసరాను అంతే ఘనంగా జరుపుకొంటారు. విజయదశమిని కొన్ని ప్రాంతాలలో దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు.దసరా పండుగ జరుపుకోవడానికి పురాణాలలో రకరకాల కథలు ఉన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ 12న ఉదయం 10.58 గంటలకి ప్రారంభమైన శుక్ల పక్షం దశమి తిథి అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటలకు ముగుస్తుంది. అంటే అక్టోబర్ 12 న విజయదశమిని జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే పురాణాలు చెబుతున్నదాని ప్రకారం..సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్లిన రావణుడిని శ్రీరాముడు యుద్ధంలో ఓడించి.. సంహరించిన రోజునే విజయ దశమిగా జరుపుకుంటారని కొన్ని ప్రాంతాలలో చెబుతారు.
అంతేకాకుండా మహిషాసురుడిని దుర్గాదేవి తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత విజయ దశమి రోజున సంహరించిందని కూడా చెబుతుంటారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులుగా కూడా పిలుస్తారు. దుర్గాదేవిని 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పశ్చిమబెంగాల్లో అయితే విజయదశమినిపెద్ద వేడుకగా నిర్వహిస్తారు.
విజయదశమి రోజున శమీ పూజ నిర్వహించి ఆ చెట్టు ఆకులను ఇచ్చుపుచ్చుకుని శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.పాండవులు అరణ్య వాసానిక వెళ్లే ముందు తమ అస్త్రాలను శమీ చెట్టు మొదట్లో దాస్తారు. వనవాసం పూర్తయిన తర్వాత ఆ ఆస్త్రాలను తీసుకుని వెళ్లి కౌరవుల మీద యుద్ధం గెలుస్తారు. దీంతోనే ప్రతీ విజయదశమికి శమీ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పండితులు చెబుతారు.
దుర్గా పూజ పదో రోజున బెంగాలీలు బిజోయ దశమిగా పాటిస్తారు. దసరా పండగ రోజున దుర్గామాత ప్రతిమలని ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు. దసరా రోజున శమీ పూజ, అపరజిత పూజ, పాలపిట్టను చూడటం వంటివి శుభకరమైనవిగా చెబుతారు.







































