ప్రేమ అనే ఈ రెండక్షరాలు మానవ సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. అయితే, ఈ ప్రేమ అనే భావన మనిషి మెదడులోని ఏ భాగాలను ప్రభావితం చేస్తుందనే విషయాలపై తాజాగా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కీలక విషయాలను తెలుసుకున్నారు.
ప్రేమ అనే భావన మనిషి మెదడులోని వివిధ భాగాలను ప్రేరేపితం చేస్తుందని అధ్యయనంలో తెలిపారు. అయితే, ఈ ప్రేమ అనేది అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదని.. వివిధ సందర్భాల్లో ఒక్కో విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తల్లిదండ్రుల మీద ప్రేమ, ప్రకృతి మీద ప్రేమ, జీవిత భాగస్వామితో ప్రేమ, రొమాంటిక్ రిలేషన్‌లో ఏర్పడే ప్రేమ, పెంపుడు జంతువులపై ప్రేమ.. ఇలా చాలా రకాల ప్రేమలు మెదడులోని పలు భాగాల్లో ప్రభావితం చేస్తాయని తేలింది.
ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడు కార్యకలాపాలను కొలవడానికి ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ అంటే.. ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్‌ని ఉపయోగించారు. ఆరు విభిన్న రకాల ప్రేమలకు సంబంధించి ప్రయోగాలను చేశారు. తత్వవేత్త, పరిశోధకురాలు అయిన పార్టిలి రిన్నే ఈ ప్రేమ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఈ అధ్యయనంలో ప్రేమ యొక్క క్రియాశీలత మెదడులోని బేసల్ గాంగ్లియా, నుదిటి మధ్యరేఖ, ప్రిక్యూనియస్‌తో పాటు.. తల వెనకవైపు ఉన్న టెంపోరోపారిటల్ జంక్షన్లోని సోషల్ సిచ్యువేషన్లలో ఏర్పడుతుందని పార్టిలి రిన్నే చెప్పారు.
స్ట్రియాటమ్ ప్రాంతంలో తల్లిదండ్రుల ప్రేమ మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్‌లో లోతైన క్రియాశీలతని కలిగి ఉంటుందట. అయితే ఇది మరే రకమైన ప్రేమలో ఇలా కనిపించలేదని రిన్నే చెప్పారు. మెదడు కార్యకలాపాలు ప్రేమించే వస్తువు యొక్క సాన్నిహిత్యం ద్వారా మాత్రమే కాకుండా, అది మనిషి లేదా మరొక జాతి లేదా ప్రకృతి అనే అంశాల పైన కూడా ప్రభావితమవుతుందని ఈ పరిశోధనలో రిన్నే కనుగొన్నారు.
అపరిచితుల పట్ల అయితే దయతో కూడిన ప్రేమ, ఇతర సన్నిహిత సంబంధాలలో ప్రేమ కంటే తక్కువ మెదడు క్రియాశీలతను కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది. ప్రకృతిపై ప్రేమ మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్‌తో పాటు విజువల్ ఏరియాలను కూడా ప్రభావితం చేస్తుంది. పెంపుడు జంతువులు లేదా ప్రకృతి పట్ల ప్రేమకు భిన్నంగా మనుష్యులు మధ్య ప్రేమ మెదడుపై ప్రభావం చూపించే దానిలో చాలా తేడాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.